
వరద బాధితులకు అండగా ఉండాలి
కూనవరం: వరద బాధితులకు అండగా ఉండాలని, అధిక గ్రామాల ప్రజలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ ఉండవల్లి గాంధీబాబుకు సూచించారు. శబరి కొత్తగూడెంలో ఏఎస్‌డీఏస్ ఆధ్వర్యంలో సోమవారం 302 కుటుంబాలకు నిత్యావసర సరకుల కిట్లను ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్, ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈసందర్భంగా సంస్థ డైరెక్టర్ గాంధీబాబును పీవో అభినందించారు. అనంతరం శబరి కొత్తగూడెం గ్రామస్తులతో పీవో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రావలసిన సదుపాయాలను నిర్వాసితులకు అందేలా చూస్తామన్నారు. వరదలపై భయం వద్దని, ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం అందిస్తున్నామని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సర్వేల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, అర్హులకు ప్యాకేజీ అందజేస్తామన్నారు. అందరికీ ప్యాకేజీ అందుతుందని ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్ కట్టం లక్ష్మి, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్

వరద బాధితులకు అండగా ఉండాలి