
పీహెచ్‌సీల్లో ఓపీ బంద్
వైద్యుల సమ్మెతో రోగులకు అవస్థలు
సాక్షి,పాడేరు/ఎటపాక/కొయ్యూరు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీహెచ్‌సీల వైద్యులు సమ్మె బాటపట్టడంతో రోగులు అవస్థలకుగురయ్యారు. ఆందోళనలో భాగంగా తొలిరోజు సోమవారం ఓపీ సేవలు నిలిపివేశారు. జీవో నంబర్ 99 ద్వారా కోత విఽధించిన ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ,పదోన్నతుల కల్పన,గిరిజన అలవెన్స్, 104 సంచార చికిత్స అలవెన్స్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వ వైద్యులు సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలోని 64 పీహెచ్‌సీల్లో సోమవారం ఓపీ సేవలు నిలిచిపోయాయి. గ్రామాల్లో సంచార వైద్యసేవలకు వైద్యులు అందుబాటులో లేరు. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గర్భిణులు ఇబ్బందులకు గురయ్యారు. వైద్యసిబ్బంది రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఎటపాక మండలంలో నెల్లిపాక,గౌరిదేవిపేట,లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజూ సుమారు నాలుగు వందల మంది వైద్యసేవలు పొందుతారు. అయితే సోమవారం డాక్టర్లు విధులు బహిష్కరించడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా ఆస్పత్రులకు వచ్చిన రోగులకు స్టాఫ్‌నర్స్‌లే అరకొర వైద్యం అందించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కొందరు రోగులు ఆర్‌ఎంపీలను ఆశ్రయించాల్సి వచ్చింది. కొయ్యూరు,బంగారంపేటలలో నిర్వహించిన వైద్య శిబిరాలకు వైద్యులు హాజరుకాకపోవడంతో రోగులు అవస్థలకు గురయ్యారు. ఈనెల 30వతేదీ మంగళవారం నుంచి వైద్యులు ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నారు. జిల్లా కేంద్రం పాడేరులో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నా రు. అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించేందుకు, అక్టోబర్ 2న విజయవాడలో వైద్యుల సంఘ నేతలు రిలే దీక్షల కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు.
ఎంపీ డాక్టర్ తనూజరాణిని కలిసిన
పీహెచ్‌సీ వైద్యులు
పాడేరు : జిల్లాలో పలు పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు సోమవారం పాడేరులో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణిని కలిసి తమ సమస్యలు వివరించారు. తమ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను ఎంపీకి తెలిపారు. తమ ఉద్యమం ప్రజలకు వ్యతిరేకం కాదని చెప్పారు. 30వ తేదీ నుంచి నిరసన ర్యాలీలు, ప్రదర్శనలతో ఉద్యమం ఉధృతం చేయనున్నట్టు, 3వ తేదీ నుంచి విజయవాడలో నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తమ న్యాయమైన ఉద్యమానికి మద్దతు తెలపాలని వారు కోరారు. వైద్యుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తానని వారికి ఆమె హామీ ఇచ్చారు.

పీహెచ్‌సీల్లో ఓపీ బంద్

పీహెచ్‌సీల్లో ఓపీ బంద్

పీహెచ్‌సీల్లో ఓపీ బంద్