● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
● పెరుగుతున్న గోదావరి ప్రవాహం
చింతూరు: వరదల కారణంగా విలీనమండలాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో గోదావరి నది ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. సోమవారం రాత్రికి 46.5 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. మరోవైపు మహారాష్ట్రలోని ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, సరస్వతి ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీటిని దిగువకు వదలడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశాలున్నాయి. దిగువనున్న కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో పలుచోట్ల వరదనీరు రహదారులపై ఉండడంతో సుమారు 60కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నదీ పరీవాహక గ్రామాల ప్రజలు వైద్యం, నిత్యావసర సరకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి నాటు పడవల ద్వారా వరదనీటిని దాటుతున్నారు. ఇప్పటికి ఐదుసార్లు వరద రావడంతో వ్యవసాయ పనులు సకాలంలో సాగక ఈ ఏడాది పంటలు నష్టపోయే అవకాశముందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వరి, మిర్చి పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
చింతూరు మండలంలో కుయిగూరు వాగు ఉధృతి కొంతమేర తగ్గడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు వరదనీటిలో రాకపోకలు కొనసాగుతున్నాయి. సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద నీరు ఇంకా చింతూరు, వీఆర్‌పురం ప్రధాన రహదారిపై నిలిచి ఉండడంతో వరుసగా నాలుగో రోజుకూడా చింతూరు, వీఆర్‌పురం మండలాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని మల్లెతోట, ఉలుమూరు, ఏజీకొడేరు, తిమ్మిరిగూడెం, కొండపల్లి, పెదశీతనపల్లి, చినశీతనపల్లి, బొడ్రాయిగూడెం, రామన్నపాలెం, నర్సింగపేట, ముకునూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం పెదశీతనపల్లికి చెందిన శ్యామల రత్తమ్మ పాముకాటుకు గురవడంతో నాటుపడవ ద్వారా సోకిలేరువాగు దాటించి ఆటోలో చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి తెలిపారు.
వీఆర్‌పురం: పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో మూడు నెలల వ్యవధిలో మండలంలో ఏడు పర్యా యాలు గోదావరికి వరద వచ్చింది. వరుస వర దలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల నుంచి మండల కేంద్రానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో నిత్యావసర సరుకుల కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అన్నవరం వాగుపై గల కాజ్‌వే కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు, రైతులు, రోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని శ్రీరామగిరి, తోటపల్లి, సీతంపేట, ఇప్పూరు, వడ్డిగూడెం, వడ్డిగూడెం కాలనీ, చింతరేవుపల్లి, రామవరం, రామవరంపాడు, చిన్నమట్టపల్లి, అడవి వెంకన్నగూడెం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వరినాట్లు, పొగాకు నారుమడులు నీటమునిగాయి.
వరదలతో స్తంభించిన జనజీవనం