
ఫేజ్–2 పనులు పునఃప్రారంభించాలి
అరకులోయ టౌన్: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఫేజ్–2లో నిలిపివేసిన పనులు తిరిగి ప్రారంభించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని రవ్వలగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో సీఎం హామీ పనులపై జిల్లాలోని ఏటిడబ్ల్యూ, టీడబ్ల్యూ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫేజ్–2లో చేపట్టి, అర్ధంతరంగా ఆగిపోయిన పనుల వివరాలను తెలుసుకున్నారు. ఏ ఇంజినీరింగ్ శాఖకు ఎన్ని పనులు మంజూరయ్యాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫేజ్–1లో మంజూరైన పనులన్నీ సకాలంలో పూర్తయ్యాయని చెప్పారు. ఫేజ్–2లో పనుల స్థితిగతులపై ఆయా మండలాల ఏటీడబ్ల్యూవోలు, ఇంజినీరింగ్ అధికారులు సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఫేజ్–2కి ఇన్‌పుట్ డేటా షీట్ తయారు చేయాలని, లేటెస్ట్ ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఫేజ్–2లో మొదలు కాని పనులకు ప్రతిపాదనలు అక్టోబర్ 10వ తేదీలోగా పంపాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు కలిసి తనిఖీ చేసి జిల్లాలో మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన టాయిలెట్స్ జాబితా తయారు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. జిల్లాలో ఎస్‌ఎమ్‌ఐ పనుల స్థితిగతులపై ఆరా తీశారు.
బేస్‌లైన్ శిక్షణకు తప్పక హాజరుకావాలి
బేస్‌లైన్ శిక్షణ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. మాస్టర్ ట్రైన్స్‌కి బేస్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిందన్నారు. రాబోయే కాలంలో కూడా పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఏ పాఠశాలలో పనితీరు బాగోలేదో ఆ పాఠశాల హెచ్‌ఎం, ఏటీడబ్ల్యూవో, టీచర్‌లపై చర్యలు తప్పవన్నారు. ఐటీడీఏల వారీగా పీఎంఆర్‌సీలలో అకాడమిక్ మోనిటరింగ్ సెల్ ప్రారంభిస్తామని చెప్పారు. పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు బి.స్మరణరాజ్, శుభం నోక్వాల్, సమగ్ర శిక్ష అధికారి స్వామి నాయుడు, డీఈవో పి.బ్రహ్మాజీ, టీడబ్ల్యూ, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు, 22 మండలాల డీఈఈలు, ఏఈఈలు, ఎంఈవోలు, ఏటీడబ్ల్యూలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్