అరకులోయ టౌన్: గంజాయి జోలికి పోవద్దని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. సోమవారం అరకులోయలో ఎస్పీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మందికిపైగా ఎన్‌సీసీ క్యాడెట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గంజాయి జోలికి పోవద్దు, ఖైదీలుగా మారవద్దు, సే నో టు గంజాయి అంటూ ఎన్‌సీసీ క్యాడెట్లు ర్యాలీలో నినదించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ డ్రగ్స్‌కు అలవాటు పడకూడదని సూచించారు. గంజాయి పండించవద్దని, యువత బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దన్నారు. గంజాయిపై ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్టు చెప్పారు. ఉపాధికి అనేక మంచి మార్గాలు ఉన్నాయన్నారు. అరకులోయ ప్రాంత సహజ, సాంస్కృతిక గొప్పతనాన్ని తెలుసుకునేందుకు ట్రెక్కింగ్ చేసేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్లు కూడా స్థానిక గిరిజన యువతనే గైడ్‌లుగా నియమించుకున్నారన్నారు. ర్యాలీ అనంతరం గంజాయి వల్ల కలిగే అనర్థాల గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు వారి భాషల్లో అర్థమయ్యేటట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలిండియా ట్రెక్కింగ్ క్యాంప్ కమాండెంట్ నీరజ్ కుమార్, పోలీసులు పాల్గొన్నారు.
ఎన్‌సీసీ క్యాడెట్ల ర్యాలీలో ఎస్పీ అమిత్ బర్డర్