చింతపల్లి: మండలంలో చౌడుపల్లి సమీపంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో కుడుముసారి పంచాయతీ కోటగున్నలు గ్రామానికి చెందిన మర్రి సాగర్ (21)చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం చింతపల్లి వచ్చి పనులు చూసుకుని తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా చౌడుపల్లి సమీపంలో గల వంతెన వద్ద వాహనం జారి పోయి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన సాగర్‌ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.