
కదం తొక్కిన ఆదివాసీలు
ఎటపాక: చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆదివాసీలు చేపట్టిన ధర్మయుద్ధం బహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభకు ఆంధ్రా, తెలంగాణ నుంచి వేలాది మంది గిరిజనులు తరలిరావడంతో భద్రాచలం పట్టణం ఆదివాసీలతో కిక్కిరిసిపోయింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ, ఆటపాటలతో భారీ ర్యాలీ చేసి కాలేజీ మైదానంలో సభ నిర్వహించారు. కొన్ని దశాబ్దాలుగా అక్రమంగా ఆదివాసీల రిజర్వేషన్లు అనుభవిస్తూ విద్య, ఉద్యోగ రాజకీయ ఫలాలను దొడ్డిదారుల్లో లంబాడీలు దోచుకుంటున్నారని నేతలు ఆరోపించారు. పాలక ప్రభుత్వాలు ఆదివాసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. లంబాడీలను ఎస్టీల జాబితా నుంచి తొలగించే వరకు ఆదివాసీల ఉద్యమం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సభకు ఆంధ్రా నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను కృతజ్ణతలు తెలిపారు.