
రహదారిపై పశువులు.. పెరుగుతున్న ప్రమాదాలు
వాహనచోదకులకు తప్పని పాట్లు
చింతపల్లి: చింతపల్లిలో జాతీయ రహదారిపై అడ్డంగా పడుకుని పశువులే స్పీడుబ్రేకర్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం గూడెం కొత్తవీధి మండలం రొంపులు నుంచి లంబసింగి వరకూ 516 జాతీయ రహదారి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చింది.ఈ రహదారిపై ప్రతిరోజు అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు, వ్యాన్‌లతో పాటు బస్సులు పెద్ద వాహనాలు తిరుగుతున్నాయి. నిత్యం పశువులు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో వాటిని తప్పించబోయి అనేకమంది వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న ప్రమాదాల నుంచి ప్రాణాప్రాయ పరిస్థితుల వరకు చోటుచేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్తితి చింతపల్లి మండల కేంద్రంలోనే కాకుండా గూడెంకొత్తవీధి మండలం రొంపులు ఘాట్ రోడ్డు మొదలుకుని చాపరాతి పాలెం, పెదవలస, రింతాడ, పెంటపాడు, రింతాడ, లోతుగెడ్డ జంక్షన్ రాజుపాకలు, లంబసింగి వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పరిస్థితి లేదని పలువురు వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై పశువులు తిష్టవేయడంతో ప్రమాదాల బారినపడుతున్న వాహనచోదకుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో ఈ పశువులు మకాం ఎక్కువగా ఉండడంతో ఎప్పుడు ఏ విద్యార్థికి ఏం జరుగుతుందోనని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి రోడ్లుపై పశువులను విచ్చలవిడిగా విడిచిపెట్టే పశు యజమానులపై చర్యలు తీసుకుని ప్రమాదాలను నివారించాలని పలువురు కోరుతున్నారు.