
గోదారి దోబూచులాట
తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన వరద
ముంపులో పలు రహదారులు
అవస్థలు పడుతున్న విలీన మండలాల ప్రజలు
చింతూరు: గోదావరి వరద తగ్గుతూ...పెరుగుతూ దోబూచులాడుతోంది. తగ్గినట్లే తగ్గి, తెల్లారే సరికి మళ్లీ పెరగడంతో విలీన మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండండంతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ఆదివారం ఉదయం భద్రాచలం వద్ద 42.1 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం తిరిగి ఏడు గంటల నుంచి క్రమంగా పెరుగుతూ 43 అడుగులు దాటడంతో అధికారులు మరోమారు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఆదివారం రాత్రి గోదావరి నీటిమట్టం 43.3 అడుగులకు చేరుకుంది. తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరిగితే గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది. వరద మళ్లీ పెరుగుతుండడంతో కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు మండలాల్లో పలు రహదారులు ముంపులో ఉండడంతో సుమారు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో కుయిగూరువాగు వరద నీరు జాతీయ రహదారి పై నిలిచి ఉండడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు నిలిచిపోయాయి.
స్వల్పంగా తగ్గిన శబరినది
చింతూరు మండలంలో శబరినది వరద నెమ్మదిగా తగ్గుతోంది. శనివారం రాత్రికి 35 అడుగులకు చేరుకున్న శబరినది నీటిమట్టం క్రమేపీ తగ్గుతూ ఆదివారం రాత్రికి 31.5 అడుగులకు చేరింది. కాగా రహదారులపై వరదనీరు ఇంకా నిలిచి ఉండడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు కొనసాగడంలేదు. సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద కారణంగా చింతూరు, వీఆర్‌పురం మండలాల నడుమ వరుసగా మూడోరోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే రహదారిలో చింతూరు మండలం నర్సింగపేట, ముకునూరు, రామన్నపాలెం, చినశీతనపల్లి, బొడ్రాయిగూడెం, కొండపల్లి, పెదశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు రాకపోకలు కొనసాగడంలేదు. కుయిగూరువాగు వరద కారణంగా కల్లేరు, మదుగూరు, సూరన్నగొంది, కుయిగూరు గ్రామాలకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నాటు పడవలపై ప్రయాణిస్తున్నారు. మండలంలో ముంపునకు గురైన వరిపంట కుళ్లిపోయే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముంపులో కొండ్రాజుపేట రహదారి
కూనవరం: భద్రాచలంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఉదయం నుంచి కూనవరం టు భద్రాచలం మార్గంలో పోలిపాక వద్ద రూట్ క్లీరైంది. దీంతో వాహనాల రాకపోకలు సాగాయి. కొండ్రాజుపేట రహదారి మూడవ రోజు కూడా వరద ముంపులోనే ఉంది. ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరద నీరు తగ్గుతూ పెరుగుతుండడంతో భద్రాచలం టు కూనవరానికి రూటు ప్రయాణానికి అనువుగా ఉన్నదీ లేనిది తెలియక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.
మిర్చి రైతులకు తీవ్ర నష్టం
ఎటపాక: గోదావరి వరద కారణంగా నాలుగు రోజులుగా మిర్చి తోటల్లో నీరు నిలువ ఉండడంతో మొక్కలు కుళ్లిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో 850 ఎకరాల్లో మిర్చి సాగుచేస్తున్నారు. నందిగామ,తోటపల్లి,నెల్లిపాక,మురుమూరు వాగుల పరీవాహక ప్రాంతాల్లో సుమారు వంద ఎకరాల్లో పంట నీటి మునిగింది. దీంతో రూ.25 లక్షల వరకూ నష్టం జరిగింది. వరద ముంపు ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే అదును దాటి పోయి, మరోసారి మిర్చి నారు వేసే అవకాశం లేకుండా పోతుంది. ఈఏడాది రబీ ప్రారంభంలోనే అన్నదాతను వరద కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. వరద కారణంగా నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

గోదారి దోబూచులాట