
అక్రమ కేసులకు మూల్యం చెల్లించక తప్పదు
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
● డిజిటల్ బుక్, క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ
అరకులోయటౌన్: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కూటమి నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ పదవుల్లో ఉన్న పార్టీ నాయకులతో కలిసి డిజిటల్ బుక్, క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపించి వేధిస్తోందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిజిటల్‌బుక్ ఆధారంగా చట్టబద్ధంగా బుద్ధి చెబుతామన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నాయకులు అక్రమ కేసులు పెట్టినా, దాడులు జరిపినా డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుందన్నారు, అధికార మదంతో అక్రమ కేసులు పెట్టిన కూటమి నాయకులు, పోలీసులు ఎక్కడన్నా చట్ట పరంగా శిక్ష విధించి, జైలుకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అరకులోయ, డుంబ్రిగుడ జెడ్పీటీసీలు శెట్టి రోషిణి, చటారి జానకమ్మ, అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, శత్రుఘ్న, స్వాభి రామచందర్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, సర్పంచ్‌లు రాధిక, గుమ్మా నాగేశ్వరరావు, దురియా భాస్కర్‌రావు, పాగి అప్పారావు, సెంబి సన్యాసిరావు, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణిక్య, డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గండేరు సత్యం, మండల పార్టీ అధ్యక్షులు రామూర్తి, పరశురాం, కొర్రా సూర్యనారాయణ, పార్టీ ఉపాధ్యక్షులు ధనరాజు, జి.ప్రకాష్, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి నరసింహమూర్తి, గ్రీవెన్స్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సందడి కొండబాబు, కల్చరల్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షురాలు బంగురు శాంతి, మాజీ ఉప సర్పంచ్ నాగేశ్వరరావు, నాయకులు ఎల్.బి. కిరణ్, ఒలేసి కుమార్, కామేశ్వరరావు, సుందర్‌రావు,చందు,మదీన పాల్గొన్నారు.