
ఇండోర్ స్టేడియంకు మోక్షం
పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో గల ఇండోర్ స్టేడియానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పట్టణంలోని తలార్‌సింగి పాఠశాల వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియాన్ని 35 ఏళ్ల కిందట నిర్మించారు. పాడేరు పట్టణంలోని క్రీడాకారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది క్రీడాకారులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడింది. ఈ స్టేడియంలో తర్ఫీదు పొందిన ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజయం సాధించారు. అంతటి ప్రాముఖ్యమున్న స్టేడియం మరమ్మతులకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి స్పందించారు. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించారు. ఆదివారం ఇండోర్ స్టేడియం ఆధునికీకరణ పనులకు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తనూజరాణి మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించి, త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, చింతలవీధి ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, పెదబయలు జెడ్పీటీసీ కూడా బొంజుబాబు, పెదబయలు మాజీ ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు, పెదబయలు మండల సర్పంచ్‌ల ఫోరం అద్యక్షుడు కాతరి సురేష్‌కుమార్, వైఎస్సార్‌సీపీ యువనేత కొర్రా అంబేడ్కర్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, క్రీడాకారులు పాల్గొన్నారు.