
బొంగదారి జలపాతం అభివృద్ధికి చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్
పెదబయలు: మండలంలోని అరడకోట పంచా యతీ బొంగదారి జలపాతం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన కిలో మీటరు దూరం కాలినడకన వెళ్లి జలపాతాన్ని సందర్శించారు. అనంతరం బొంగదారి పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి సీసీ రోడ్డు, డ్రైనేజీలు, చెక్ డ్యాం మంజూరు చేయాలని, జలపాతం వద్దకు వెళ్లేందుకు రోడ్డు, కల్వర్టు నిర్మించాలని వైస్ ఎంపీ పీ రాజుబాబు, గ్రామస్తులు కోరారు. స్పందించి న కలెక్టర్ అన్ని పనులకు అంచనాలు తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా సిల్వర్ ఓక్, కాఫీ, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్. పూర్ణయ్య, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.