
గంజాయికి దూరంగా ఉండాలి
ఎస్పీ అమిత్ బర్దర్
ముంచంగిపుట్టు: గంజాయికి దూరంగా ఉంటే గిరిజనుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. మండలంలోని అత్యంత మారుమూల లక్ష్మీపురం పంచాయతీ సుత్తిగూడ, బిరిగూడ గ్రామాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ మారుమూల గ్రామాల్లో పర్యటించడం ప్రాధాన్యత సంచరించుకుంది. కాలినడక గ్రామాలకు చేరుకుని, గిరిజనుల జీవన విధా నం, స్థితిగతులను పరిశీలించారు. విద్యార్థులకు స్టడీమెటీరియల్,పెన్నులు,పెన్సిల్స్,స్వీట్లు పంపిణీ చేశారు. పలువురు పిల్లలతో పుస్తక పఠనం చేయించారు. విద్యార్థులు చక్కగా చదవడంతో వారిని అభినందించారు. సుత్తిగూడలో పాఠశాలకు పక్కా భవనం లేక తమ పిల్లలు చదువుకునేందుకు అవస్థలు పడుతున్నారని,పక్కా భవనం నిర్మించే విధంగా చూడాలని,గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ,తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని,లక్ష్మీపురం పంచాయతీ కేంద్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసు నడిపేలా చూడాలని గ్రామస్తులు కోరారు. తన దివ్యాంగ కుమారుడికి పింఛన్ మంజూరు చేయాలని ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా మంజూరు కాలేదని ఓ మహిళ ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని పలువురు కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ ఎస్‌కె.సాబాజ్ అహ్మద్, జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు,లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాఽథ్,పాడేరు,పెదబయలు ఎస్‌ఐలు సురేష్,రమణలు పాల్గొన్నారు.