
భగత్‌రామ్ మృతిపై పూర్తిస్థాయి విచారణ
సీలేరు: చింతపల్లి క్యాంపు గ్రామంలో ఈ నెల 21 హత్యకు గురైన వంతల భగత్‌రామ్ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అతని భార్య సోమరి, బంధువులు డిమాండ్ చేశారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. మొదటినుంచి భగత్‌రామ్‌పై నిందితుడు కక్ష కట్టడమే కాకుండా హత్యచేస్తానని పలుసార్లు బెదిరించాడన్నారు. ఈ నేపథ్యంలో భగత్‌రామ్‌ను ఒంటరిగా రమ్మని పిలిచి హత్యచేశారన్నారు. ఈ సమయంలో వీళ్లు కొట్టేస్తున్నారని, నన్ను వీళ్లు చంపేస్తున్నారని ఫోన్‌లో భర్త అనడం అనుమానం కలిగిస్తోందన్నారు. నిందితుడు ఒక్కడే తన భర్తను హత్యచేయడం సాధ్యపడదన్నారు. మరికొంతమంది పాల్గొన్నట్టుగా తమకు అనుమానం ఉందన్నారు. దీనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపి హత్యకేసును మరోసారి పూర్తిస్థాయిలో విచారణ చేయడమే కాకుండా ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిందితులు గ్రామంలోకి వస్తే శాంతిభద్రతలు సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున వారిని వేరే ప్రాంతానికి తరలించాలని చింతపల్లి క్యాంపు గ్రామానికి చెందిన రెండు వీధుల గిరిజనులు సీలేరు పోలీసులకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఇలావుండగా ఈ విషయంపై సీఐ వరప్రసాద్‌ను వివరణ కోరగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు. కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని.. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంటే వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. మృతుని బంధువులు ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
భార్య సోమరి, బంధువుల డిమాండ్