
దారులన్నీ ఏరులై. .
చింతూరు: విలీన మండలాల ప్రజలను ఐదోసారి బెంబేలెత్తించిన గోదావరి ఎట్టకేలకు శాంతించింది. భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమేపీ తగ్గుతుండడంతో విలీన మండలాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మ రోవైపు భద్రాచలం వద్ద గోదావరి తగ్గుతున్నా బ్యాక్‌వాటర్ ప్రభావంతో కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో గోదావరి, శబరినదుల వరద శనివారం రాత్రి వరకు పెరుగుతూనే ఉంది.
● వాయుగుండం వల్ల తెలంగాణలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరిగి గోదావరి ఆదివారం నుంచి పెరిగే అవకాశముందని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 6గంటలకు భద్రాచలం వద్ద గరిష్టంగా 46.6 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం పది గంటల వరకు నిలకడగా మారింది. అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ రాత్రికి 42.9 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.
● కూనవరం వద్ద శనివారం రాత్రికి గోదావరి నీటిమట్టం 44.5 అడుగులకు చేరుకోగా చింతూరు మండలంలో శబరినది నీటిమట్టం 35 అడుగుల వద్ద నిలకడగా ఉంది. గోదావరి, శబరినదులు ఉధృతి వల్ల వరదనీరు రహదారులపై చేరడంతో చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల్లో సుమారు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
● చింతూరు మండలంలో కుయిగూరువాగు వరదనీరు జాతీయ రహదారి–326 పైకి చేరడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీసంఖ్యలో వాహనాలు నిమ్మలగూడెం వద్ద ఆగిపోయాయి. వరద కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయిన గ్రామాలకు నిత్యావసరాలతో పాటు తాగునీరు అందించాలని బాధితులు కోరుతున్నారు.
చింతూరు మండలంలో : గోదావరి ఎగపోటుకు తోడు భారీవర్షంతో ఎగువనుంచి వస్తున్న వరదనీటితో చింతూరు మండలంలో శబరినది శనివారం మరింత పెరిగింది. దీంతో మండలంలోని జల్లివారిగూడెం, సోకిలేరు, కుయిగూరు, చంద్రవంక, చీకటివాగులు పొంగి వరదనీరు రహదారులను ముంచెత్తింది.
● జల్లివారిగూడెం, సోకిలేరు, చీకటివాగుల వరద కారణంగా వరుసగా రెండోరోజు కూడా చింతూరు నుండి వీఆర్‌పురం మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు మండలంలోని నర్శింగపేట, ముకునూరు, పెదశీతనపల్లి, కొండపల్లి, బొడ్రాయిగూడెం, రామన్నపాలెం, చినశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
● చంద్రవంకవాగు కారణంగా కుమ్మూరుకు, కుయిగూరువాగు కారణంగా కల్లేరు, మదుగూరు, సూరన్నగొంది, కుయిగూరు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
పొలాల్లోకి వరదనీరు
మరోవైపు గత నెలలో వరద వచ్చి తగ్గడంతో మళ్లీ వరద రాదని భావించి చాలామంది రైతులు వాగుల పరివాహక ప్రాంతాల్లో వరినాట్లు వేశారు. తిరిగి ఊహించని విధంగా వరి పొలాల్లోకి వరదనీరు చేరుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎరువులు సక్రమంగా అందకపోయినా అప్పులు చేసి మరీ ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసి పంటలకు వేశామని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూనవరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కూనవరం వద్ద శబరి, గోదావరి నదులకు వరద పోటెత్తింది. శనివారం కూనవరం టు భద్రాచలం ప్రధాన రహదారిపైన పోలిపాక, ముర్మూరు మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డుపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం, కూనవరం నడుమ రాకపోకలు స్తంభించాయి. గత మూడు రోజుల నుంచి కొండ్రాజుపేట రహదారి వరద ముంపులో ఉన్నందున 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం వద్ద బ్రిడ్జిని తాకుతూ గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
విలీన మండలాల్లో ఐదోసారి సంభవించిన గోదావరి వరద ప్రజలను కష్టాల పాల్జేసింది. గోదావరి శాంతించినా ఇప్పటికీ గ్రామీణ రహదారులు ముంపులోనే ఉన్నాయి. వీఆర్‌పురం మండలంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 300 ఎకరాల్లో పొగాకు, మిర్చినారు, వరినాట్లు నీట మునగడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
300 ఎకరాల్లో నీటమునిగిన పంటలు
వీఆర్‌పురం: మండలంలో సుమారు 300 ఎకరాల్లో పొగాకు, మిర్చినారు, వరినాట్లు నీటమునిగాయి.దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీరామగిరి గ్రామంలో వరదనీరు ఇళ్లవద్దకు చేరడంతో బాధితులు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వడ్డిగూడెం చుట్టూ వరదనీరు పొంచి ఉండటంతో గ్రామస్తుల్లో భయం నెలకొంది. చింతరేగుపల్లి, కన్నాయిగూడెం, రామవరం, తుష్టివారిగూడెం, శ్రీరామగిరి, సీతంపేట, పోచారం, ఇప్పూరు ప్రాంతాల్లో వరదనీరు రహదారులపై చేరడంతో అధికారులు నాటు పడవలను ఏర్పాటుచేశారు.
70 గ్రామాలకు రాకపోకలు బంద్ భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
విలీన మండలాల్లో తగ్గుముఖం పట్టని వరద ప్రభావం శబరి నది ఎగపోటుతో ఉప్పొంగిన వాగులు

దారులన్నీ ఏరులై. .

దారులన్నీ ఏరులై. .

దారులన్నీ ఏరులై. .

దారులన్నీ ఏరులై. .

దారులన్నీ ఏరులై. .

దారులన్నీ ఏరులై. .

దారులన్నీ ఏరులై. .

దారులన్నీ ఏరులై. .

దారులన్నీ ఏరులై. .

దారులన్నీ ఏరులై. .