
డొంకరాయి నుంచినీరు విడుదల
మోతుగూడెం: ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండిపోయాయని డొంకరాయి డ్యామ్ ఏఈ శివశంకర్ శనివారం తెలిపారు. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లోని డొంకరాయి ప్రధాన ఆనకట్ట ఏడో గేటును 2.90 అడుగుల మేర ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన ఆనకట్ట గరిష్ట నీటిమట్టం 1037 అడుగులు కాగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం సాయంత్రానికి నీటిమట్టం 1035.60 అడుగులకు చేరుకుందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో మూడువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. నీటి మట్టం సాధారణ స్థాయికి వచ్చిన తరువాత గేటును మూసివేస్తామని ఆయన తెలిపారు.
6 నుంచి క్రీడా పోటీలు
అరకులోయ టౌన్: మండల, డివిజన్ స్థాయి లో అన్ని రకాల క్రీడా పోటీలు, రాష్ట్ర స్థాయిలో కేవలం ఆర్చరీ పోటీలు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు పాంగి సూరిబాబు, కె. భవాని ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 6,7 తేదీల్లో మండల స్థాయిలో నిర్వహిస్తామ న్నారు. 8 నుంచి 11 వరకు డివిజన్ స్థాయి, 23 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.
రేపు జాబ్ మేళా
వై.రామవరం: రంపచోడవరంలోని భాను సప్లై భవనంలో ఈనెల 29న అంబుజా ఫౌండేషన్, హెచ్‌డీఎఫ్‌సీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు అంబుజా సెంట్రల్ మేనేజర్ బి.శ్రీకాంత్ తెలిపారు. అదేరోజు ఉదయం ఉదయం పది గంటల నుంచి 300కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుతాయన్నారు. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూస్టార్, బ్లూఓషన్ తదితర కంపెనీలు పాల్గొంటున్నట్టు తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, పాస్‌పోర్టుసైజు ఫొటోలు తీసుకురావాలన్నారు. వివరాలకు అంబుజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను 9494546366, 9701869742 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.