రాజవొమ్మంగి: పరిమితికి మించి అధిక బరువుతో రాజవొమ్మంగి మండల పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న క్వారీ, కలప లారీల వల్ల రహదారులు చిధ్రంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్లు కోతకు గురై రాళ్లు తేలడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజవొమ్మంగి మండలంలోని వయ్యేడు, అప్పలరాజుపేట, బడదనాంపల్లి గ్రామాల నుంచి బెంగుళూరు తదితర ప్రాంతాలకు తాటిచెట్లు, జామాయిల్, సర్వే కలప అధిక లోడుతో వెళుతున్న సుమారు20 టన్నుల నుంచి 30 టన్నుల వరకు లారీలు బీటీ రహదారులను ముక్కలు చేస్తున్నాయి. మరో వైపు ఏలేశ్వరం నుంచి ఈ ప్రాంతానికి చిప్స్ (నల్లమెటల్) క్వారీ బూడి దతో తిరుగుతున్న టిప్పర్లు, లారీలను అదుపు చేసేవారే లేకపోవడంతో రహదారులు చిధ్రంగా మారి పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోతుల్లో పడి వాహనచోదకులు గాయాలపాలవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. వేయింగ్ మిషన్‌పై లోడును చెక్ చేసిన తరువాతనే కలప, క్వారీ లారీలకు పర్మిషన్ ఇవ్వాల్సిన అధికారులు అవేవీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరో వైపు రాత్రి వేళల్లో దొంగచాటుగా తిరుగుతున్న భారీ కలప వాహనాలను ఇటు పోలీసులు, అటు రెవెన్యూ, ఫారెస్టు అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో లారీ, టిప్పర్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ భారీ వాహనాల రాకపోకలను కట్టడి చేయాలని, నిబంధనల ప్రకారం లారీలను చెక్ చేసి పంపించాలని కోరుతున్నారు.
భారీ లోడ్‌ల లారీలతో
దెబ్బతింటున్న రహదారులు
రాకపోకలకు ఇక్కట్లు
పెరుగుతున్న ప్రమాదాలు
చోద్యం చూస్తున్న అధికారులు
దారుణ దారులు