
జీఎస్టీపై అవగాహన తప్పనిసరి
● కలెక్టర్ దినేష్‌కుమార్
● పాడేరు పట్టణంలో ర్యాలీ
పాడేరు : జీఎస్టీపై వర్తకులు, వ్యాపారులు, వినియోగదారులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. కేంద్రం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కొత్త జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని వారపు సంతలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా గిరిజన సమాఖ్య కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ బజారు మీదుగా పాత బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ కొత్త జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువులపై ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. దీంతో పేదవాడికి, సామాన్యుడికి మేలు చేకూరుతుందన్నారు. ఈనెల 22 నుంచి కొత్త ధరలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కొత్త ధరలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎవరైనా తగ్గించిన జీఎస్టీ కన్నా అదనంగా జీఎస్టీ వసూలు చేసి అధిక ధరలకు అమ్మితే సంబంధిత శాఖ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్‌డీఏ పీడీ మురళి, జీఎస్టీ నోడల్ అధికారి పద్మజ, పలు శాఖల అధికారులు, మహిళ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.