
రోగిని తరలించేందుకు అష్టకష్టాలు
● మంచంపై మోసుకుని అంబులెన్సు వరకు తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు
● రహదారి సౌకర్యం లేక మొక్కపుట్టు
గిరిజనుల అవస్థలు
ముంచంగిపుట్టు: అనారోగ్యానికి గురైన గిరిజనుడిని ఆస్పత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మాకవరం పంచాయతీ మొక్కపుట్టు గ్రామానికి చెందిన మండి మంగరాజు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం అతని అరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. రహదారి సౌకర్యం లేనందున గ్రామానికి 108 వాహనం రాలేని పరిస్థితి. దీంతో రహదారి సౌకర్యం ఉన్న లబడపుట్టు వరకు రెండు కిలోమీటర్ల మేర మొక్కపుట్టు నుంచి మంచంపై ముగ్గురు యువకులు అతనిని మోసుకుని తీసుకు వచ్చారు. అక్కడి నుంచి 108 ఎక్కించి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. తక్షణమే గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని పీసా కమిటీ కార్యదర్శి వంతాల లక్ష్మణ్, మొక్కపుట్టు గ్రామ గిరిజనులు రాజేంద్ర, పితంబరం, శ్యామలరావు, జగన్, పద్మ కోరారు.