
మా భూముల జోలికి వస్తే అంతుచూస్తాం
పాడేరు రూరల్: మా భూముల జోలికి వస్తే అంతు చూస్తామని మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ పరిసర ప్రాంతాల గిరిజనులు హెచ్చరించారు. అటవీశాఖ అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం స్థానిక సబ్ డీఎఫ్‌వో కార్యాలయాన్ని వారు ముట్టడించారు. మాడగుడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్ ఏర్పాటు నేపథ్యంలో అక్కడ ఉపాధి పొందే నిమిత్తం ఏర్పాటుచేసుకున్న గుడారాలు, పర్యాటకులకోసం చేసిన ఏర్పాట్లను అటవీశాఖ అధికారులు కొద్దిరోజులక్రితం తొలగించారు. ఈ నేపథ్యంలో సబ్ డీఎఫ్‌వో కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు రిజర్వ్ ఫారెస్ట్ పరిధి అని చెప్పి తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అడవిపై సర్వహక్కులు గిరిజనులవే..:
మాడగడ సర్పంచ్ జ్యోతి, పీసా కమిటీ సభ్యుడు బాలరాజు, మాజీ సర్పంచ్ అర్జున్
గిరిజన ప్రాంతంలో అడవిపై సర్వం హక్కులు గిరిజనులకే ఉందని చట్టాలు చెబుతున్నాయని మాడగడ సర్పంచ్ జ్యోతి, పీసా కమిటీ సభ్యుడు బాలరాజు, మాజీ సర్పంచ్ అర్జున్ అన్నారు. అయితే అటవీశాఖ అధికారుల తీరు మాత్రం గిరిజనులకు వ్యతిరేకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా గ్రామ సమీపంలోని సన్ రైజ్ వ్యూ పాయింట్‌ను పరిసర గ్రామాల ప్రజలు అభివృద్ధి చేస్తే ఇప్పుడు అటవీ శాఖ అధికారులు చొరబడి గిరిజనులపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఎకో టూరిజం పేరుతో గిరిజనుల భూములు అక్రమించే ప్రయత్నం చేస్తే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఏవిధంగా భయపెట్టినా తమ భూములను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. తక్షణం ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి సర్వే నిర్వహించి సన్‌రైజ్ వ్యూ పాయింట్‌ను పంచాయతీకి తక్షణం అప్పగించాలని డిమాండ్ చేశారు.
న్యాయం చేస్తాం:
సబ్ డీఎఫ్‌వో ఉమామహేశ్వరి
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని సబ్ డీఎఫ్‌వో ఉమామహేశ్వరి అన్నారు. ఆందోళన కారులతో ఆమె మాట్లాడుతూ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేసి స్థానికులకే ఉపాధి కల్పిస్తామన్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ సర్వే నిర్వహించి సరిహద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
న్యాయం చేయాలని వినతి
సన్‌రైజ్ వ్యూ పాయింట్ భూముల విషయంపై న్యాయం చేయాలని సర్పంచ్ ఎం.జ్యోతి, సమీప గ్రామాల గిరిజనులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ దినేష్‌కుమార్‌ను కోరారు. దీనిలో భాగంగా పాడేరు ఐటీడీఏలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు తమ సమస్యను వివరించారు. జాయింట్ సర్వే నిర్వహించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్
పరిసర గిరిజనుల హెచ్చరిక
అటవీశాఖ అధికారులు అన్యాయంగా గుడారాలు తొలగించారని ఆవేదన
సబ్ డీఎఫ్‌వో కార్యాలయం ముట్టడి
జాయింట్ సర్వే నిర్వహిస్తామని
ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమణ

మా భూముల జోలికి వస్తే అంతుచూస్తాం