
‘హైడ్రో పవర్’కు గిరిజనుల భూములు ఎలా కేటాయిస్తారు
● పోడు భూముల పట్టాలకు ఆంక్షలా
● ప్రభుత్వాల తీరుపై సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స ధ్వజం
అరకులోయ టౌన్: గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి గిరిజనుల జిరాయితీ భూములు ఎలా కేటాయిస్తుందని ఆదివాసీ గిరిజన సంఘ ప్రతినిధి, సీపీఎం జిల్లా కార్యదర్శి పాచిపెంట అప్పలనర్స ప్రశ్నించారు. ఈ నెల 22న సీలేరు నుంచి ప్రారంభించిన అరణ్య గర్జన జీపు యాత్ర గురువారం అరకులోయ మండలం లోతేరు పంచాయతీ తొరడం వలస చేరుకుంది. ఈ సందర్బంగా అప్పలనర్స మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి జారీ చేసిన జీవో నంబరు 13, 51ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రభావిత గిరిజనుల భూములను పరిశీలించారు. ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అదాని, నవయుగ కంపెనీలకు వేలాది ఎకరాల గిరిజనుల భూములు ఎలా ధారదత్తం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈనెల 27న మజ్జివలనలో జరిగే జీపు యాత్ర ముగింపు సభలో ఆదివాసీ గిరిజనులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు ధర్మాన పడాల్, కొర్రా త్రినాథ్, రాజు, కిల్లో రామన్న, గెన్ను, వరహాలబాబు, సింహాద్రి, భగత్ సింగ్ పాల్గొన్నారు.