
కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన
చింతపల్లి: ఆంధ్రప్రదేశ్ అటవీ అబివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ)లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. గురువారం చింతపల్లిలో ఏపీఎఫ్‌డీసీకి చెందిన అన్ని డివిజన్ల కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాఫీ యాజమాన్యానికి కార్మిక సంఘాలకు జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీల్లో కార్మికుల ఇళ్లకు కొద్దిపాటి మరమ్మతులు చేపట్టడం మినహా ఏఒక్కటి నెరవేర్చలేదన్నారు.
ప్రధానంగా సంస్థ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం దుర్మార్గమన్నారు. క్షేత్ర స్థాయిలో ఖాళీగా ఉన్నటువంటి ప్లాంటేషన్ కండక్టర్లను మూడు నెలల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. కాఫీ సేకరణకు ముందు కూలి రేట్లు, కాఫీ పండ్ల సేకరణ ధరలు పెంచాలని ,26 రోజులు పని కల్పించాలని, వారంతపు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయడమే కాకుండా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారానికి యాజమాన్యం చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు వెంకటేష్, గిరి, నాగేశ్వరరావు, నగేష్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ హెచ్చరిక