
శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ హేమతలతకు శానిటేషన్ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆర్ ముత్యాలమ్మ మాట్లాడుతూ శానిటేషన్ కార్మికులకు 2024 నవంబర్‌లో పెంచిన కొత్త వేతన జీవోను అమలు చేయాలన్నారు. డ్యూటీ చార్ట్ ఇవ్వాలని, ప్రధానంగా ఈపీఎఫ్, ఈఎస్‌ఐ తప్పిదాలు సరిచేయాలని, జీతంతో ముడి పెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రతీనెలా మొదటి వారంలో జీతాలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని బకాయి వేతనాలు చెల్లించాలని, సీనియారిటీ ప్రకారం సూపర్‌వైజర్ పోస్టులు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. పెస్ట్ కంట్రోల్ ఎస్‌ఎంసీ, ఎన్‌ఆర్‌సీ, క్యాంటీన్, బర్త్ వెయింట్ విభాగాలలో కార్మికుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. వీటిని ప్రభుత్వం పరిష్కరించకుంటే కార్మికులతో కలసి వచ్చే నెల 15వ తేదీ తరువాత సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. శానిటేషన్ కార్మిక సంఘ ప్ర తినిధులు సుధారాణి, చిట్టిబాబు, సత్యనారాయణ, లక్ష్మణ్, పుణ్యవతి, కొండమ్మ, శివ పాల్గొన్నారు.