
బాలికల రక్షణ బాధ్యత అందరిది
సాక్షి,పాడేరు: బాలికలను రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. గురువారం ఆమె పాడేరులో పర్యటించారు. స్థానిక ఐటీడీఏ కాఫీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన నవరాత్రి 8వ రాష్ట్రీయ పోషణ మహోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను పరిశీలించారు. గర్భిణులకు సాముహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారిత కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో రక్తహీనత, శిశుమరణాలు అధికంగా ఉన్నందున వాటిని నిరోధించాలన్నారు. ప్రతీ ఆడపిల్ల చదువుకుని సమాజంలో మంచి స్థాయికి ఎదగాలన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక బాధ్యతలు కూడా పిల్లలకు నేర్పించాలన్నారు.ఉద్యోగాల పేరుతో జరిగే సైబర్ నేరాలపై బాలికలు, మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మహిళల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, మాతాశిశు ఆరోగ్య కార్యక్రమాలను వివరించారు. అనంతరం సిడ్ ఆర్గనైజేషన్ రూపొందించిన మహిళా తస్మాత్ జాగ్రత్త పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్‌పడాల్, డీఆర్‌డీఏ పీడీ మురళీ, ఐసీడీఎస్ సీడీపీవోలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్
రాయపాటి శైలజ