
నాలుగేళ్లలో రూ. 6 కోట్లతో అభివృద్ధి పనులు
చింతపల్లి: మండలంలో నాలుగేళ్ల కాలంలో రూ. 6 కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు నిర్వహించినట్టు ఎంపీపీ కోరాబు అనూషదేవి,జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్ తెలిపారు. తమ పదవీ కాలం నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారు బుధవారం కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండలంలోని 17 పంచాయతీల పరిధిలో రూ. 3 కోట్ల మండల పరిషత్ నిధులతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలతో పాటు 10 బోర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తాజంగిలో రూ.15 లక్షల జిల్లా పరిషత్ చైర్మన్ నిధులతో రోడ్డు నిర్మించినట్టు చెప్పారు. జిల్లా పరిషత్ నిధులు రూ.3 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు జెడ్పీటీసీ బాలయ్యపడాల్ తెలిపారు. రూ.25 లక్షలతో జెడ్పీ అతిథి గృహం మరమ్మతు పనులు, రూ.40 లక్షలతో అంగన్‌వాడీలు భవనాలు, రూ.50 లక్షలతో బోరు నిర్మాణాలు చేపట్టినట్టు చెప్పారు. తన కృషితో చింతపల్లి ప్రజలకు ఎంతో అవసరమైన కల్యాణ మండపానికి అరకు పార్లమెంటు సభ్యురాలు తనూజరాణి రూ.40 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీకే వీధీ ఎంపీపీ బోయిన కుమారి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి గణబాబు పాల్గొన్నారు.