
రూ.45 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
గంగవరం: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.45లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు సోమవారం సాయంత్రం గంగవరం శివారులో ఎండపల్లి మార్గం నెమలిచెట్లు సెంటర్ వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో గుర్తించామన్నారు. ఎండపల్లి వైపు నుంచి వస్తున్న కారు, మోటార్ సైకిల్, మినీ వ్యాన్‌లో రవాణా చేస్తున్న 30 ప్లాస్టిక్ సంచుల్లో 920 గంజాయిని రాజవొమ్మంగి సీఐ గౌరీశంకర్ పర్యవేక్షణలో గంగవరం ఎస్‌ఐ బి.వెంకటేష్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారన్నారు. ఒడిశాలోని మల్కజిగిరి నుంచి ఐదుగురు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాలకు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. మూడు వాహనాలను సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. . ఈ సందర్భంగా ఆయన ఎస్‌ఐ వెంకటేష్, సీహెచ్ వీవీ మహర్షి రాంబాబు, పీసీలు సాయినాథ్, అశోక్, వీరబాబు, కొండబాబును అభినందించారు. పట్టుకున్న గంజాయికి తహసీల్దార్ శ్రీనివాసరావు, వీఆర్వో వెంకన్నదొర సమక్షంలో తూకం వేసినట్టు డీఎస్పీ తెలిపారు.
ఐదుగురి అరెస్టు