
100 కేజీల గంజాయి పట్టివేత
కోటవురట్ల: మండలంలోని యండపల్లి వద్ద వంద కేజీల గంజాయి పట్టుబడింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. రెండు కార్లు, ఒక వ్యానును సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలు ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు యండపల్లిలో ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు చేపట్టగా, రెండు కార్లలో నుంచి వ్యాన్‌లోకి గంజాయిని మారుస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అల్లూరి జిల్లాకు చెందిన ఎ1 నిందితుడు బిసోయ్ బాలరాజు, ఎ2 తారాడ లింగంనాయుడు, ఎ4 పాంగి అశోక్‌కుమార్ కలిసి గతంలో గంజాయి వ్యాపారం చేసేవారు. ఎ1పై 2018లో పెందుర్తి పోలీసు స్టేషన్‌లోను, ఎ2పై 2013లో త్రిటౌన్ పోలీసు స్టేషన్‌లోను, ఎ4పై 2018లో పెందుర్తి, గోపాలపట్నం పోలీసు స్టేషన్లలోను గంజాయి కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎ8 నిందితుడు ఎ1, ఎ2లకు ఫోన్ చేసి గంజాయి పంపాలని కోరాడు. వారు నాలుగు మూటలుగా కట్టి రెండు కార్లలో ఎ3 నిందితుడు గొల్లోరి అనిల్‌కుమార్, ఎ5 కొర్రా శామ్యూల్‌లతో యండపల్లి వరకు పంపించి వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అల్లూరి జిల్లాకు చెందిన ఐదుగురు నిందితులతోపాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఎ6 అజయ్, ఎ7 రాహుల్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వీరిని పట్టుకోవడంలో నక్కపల్లి సీఐ రామకృష్ణ సారధ్యంలో ఎస్‌ఐ రమేష్, ఏఎస్‌ఐ గంగరాజు, హెచ్‌సీ చంద్రశేఖర్, పోలీసులు బి.కృష్ణ, ఆర్.వరం, హోంగార్డులు కె.మచ్చన్న, ఎల్.రమేష్, పి.సత్యనారాయణ ప్రతిభ చూపారని డీఎస్పీ శ్రీనివాసరావు ప్రశంసించారు.