
గర్భిణులు సకాలంలో వైద్యసేవలు పొందాలి
ఎమ్మెల్యే మత్స్యలింగం
అరకులోయటౌన్: గర్భిణులు ఆస్పత్రిలో చేరి సకాలంలో వైద్య సేవలు పొందాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అరకులోయ ఏరియా ఆస్పత్రిలో సోమవారం స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుల సలహాలు, సూచనల ప్రకారం గర్భిణులు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మహిళలు క్యాన్సర్, రక్తహీనత తదితర సమస్యల బారిన పడకుండా ఉండాలంటే సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన సీ్త్ర, శక్తివంతమైన కుటుంబం కోసం ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేశారు. తరువాత ఆస్పత్రిలో ఎమ్మెల్యే కంటి పరీక్ష చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శెట్టి రోషిణి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు స్వాభి రామూర్తి, యువజన నాయకుడు రేగం చాణిక్య, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్. రాము తదితరులు పాల్గొన్నారు.