
దేవీ వైభవం... భక్తుల తన్మయం
శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి శరణుఘోషతో ఆలయాలు మార్మోగాయి. అమ్మవారి ప్రతిమల ప్రతిష్ట, భవానీ భక్తుల మాలధారణలు, ప్రత్యేక పూజలతో గ్రామాల్లో దసరా సందడి నెలకొంది. పలు ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలో కొలువు దీరిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అలౌకికానందంతో తన్మయత్వం పొందారు. విలీన మండలాల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
పాడేరు: దసరా నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పాడేరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దుర్గాదేవి ఆలయం, గిరి కై లాస క్షేత్రంలోని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద ఉత్సవాలను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించి, దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించారు. తొలిరోజు బాలాత్రిపుర సుందరిదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల సందర్భంగా వందలాదిమంది భక్తులు భవానీ మాలధారణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాంలకరణ ఆకట్టుకుంది. ఆలయాల వద్ద భవానీ భక్తుల కోసం నిర్వాహకులు అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజుల పాటు అన్నసమారాధన నిర్వహిస్తామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
వైభవంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు
ఎటపాక: విలీన మండలాల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎటపాక మండలంలోని ఎటపాక, తోటపల్లి, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు తదితర గ్రామాల్లో మహిళలు, చిన్నారులు పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసి తలపై పెట్టుకుని శరన్నవరాత్రి ఉత్సవ మండపాల వద్దకు చేరుకున్నారు. బతుకమ్మలను ఓ చోట ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ ఆట పాటలతో సందడి చేసి, పూజలు చేశారు. సోమవారం తోటపల్లి శ్రీఆదిత్య స్కూల్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు దుర్గమ్మ వేషధారణలో పాల్గొనడం ఆకర్షణగా నిలిచింది.

దేవీ వైభవం... భక్తుల తన్మయం