
చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత
పాడేరు: చిత్తడి నేలలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెబ్‌ల్యాండ్స్ రూల్స్ 2017 ప్రకారం చిత్తడి నేలలను గుర్తించి, సరిహద్దులు నోటిఫికేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. రంపచోడవరం డివిజన్‌లో 71 వెబ్‌ల్యాండ్స్ గుర్తించినట్టు చెప్పారు. వాటిలో తాగునీరు, ఎకో కల్చర్, వ్యవసాయం, హార్టికల్చర్, ఫిషింగ్, రిక్రియేషన్, ఇరిగేషన్ ఉన్నాయో లేదో సర్వే చేసి రెండు రోజుల్లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సర్వే కోసం నియమించిన సిబ్బందికి వెబ్‌ల్యాండ్స్‌పై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. సమావేశంలో వర్చువల్ విధానంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, డీఎఫ్‌వో రవీంద్ర ధామా, జిల్లా రీసర్వే అధికారి దేవేంద్రుడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్, జిల్లా హార్టికల్చర్ అధికారి బాలకర్ణ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి విజయ్‌రామ్ తదితరులు పాల్గొన్నారు.
46 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
జిల్లా వ్యాప్తంగా వచ్చే ఏడాది వన మహోత్సవంలో 46 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లక్ష్యం రెట్టింపు అయిందని చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లో ఫారెస్ట్, విద్య, ఇంజినీరింగ్, డ్వామా , గ్రామ,వార్డు సచివాలయాల శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల డిమాండ్, అవసరం, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే మొక్కలను నివేదికలో పొందుపర్చాలన్నారు. ఐటీడీఏలు, మండలాల వారీగా మొక్కలను నాటడానికి సంబంధించిన డేటాను సిద్ధం చేయాలని ఆదేశించారు. గతంలో నాటిన మొక్కల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరిందా ? లేదా ? అనే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. గత ఏడాది డేటాను మేరీ లైఫ్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి, నివేదికలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్, శుభం నొక్వల్, పాడేరు డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీఈవో బ్రహ్మాజీరావు, సమగ్ర శిక్ష అధికారి స్వామి నాయుడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్