
ఎకో టూరిజం ప్రాజెక్టు వద్దు
అరకులోయటౌన్: మండలంలోని మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ పంచాయతీ గ్రామ సభలో ఏకగీవ్రంగా తీర్మానించారు. సర్పంచ్ పడిబారికి జ్యోతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఫారెస్టు రేంజర్ కోటేశ్వరరావు, అటవీ శాఖ అధికారులు, పంచాయతీ పాలక వర్గ సభ్యులు, మాడగడ పంచాయతీ కేంద్రంలోని గిరిజనులతోపాటు వ్యూపాయింట్ పరిసరాల గ్రామ గిరిజనులు పాల్గొన్నారు. వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించగా దానిని గ్రామస్తులు వ్యతిరేకించారు. వ్యూపాయింట్‌ను యథాతధంగా కొనసాగించాలని, ఆ స్థలాన్ని జాతీయ ప్రజా ప్రయోజన స్థలంగా ప్రకటిస్తూ, స్థానికులే వ్యూపాయింట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ స్థలం అటవీ శాఖకు చెందిన రిజర్వ్ ఫారెస్ట్ స్థలమని చెప్పారు. వ్యూపాయింట్‌కు కొంత, పకనగుడ వన సంరక్షణ సమితి కొంత స్థలం కేటాయించినట్టు చెప్పారు. గిరిజనులకు అటవీ భూమిపై అవగాహన లేకపోవడంతో ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. అటవీశాఖ అధికారులకు సహకరించాలని, అటవీ శాఖ అధికారుల విధులకు భంగం కలిగించవద్దని రేంజర్ కోరారు. ఈ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి బోగిరాజు, పీసా కమిటీ అధ్యక్షుడు మందియకేడి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.