
మూడు నెలల్లో మ్యూజియం పనులు పూర్తి
పాడేరు ఐటీడీఏ పీవో ఆదేశం
చింతపల్లి: స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. తాజంగిలో వద్ద రూ.35 కోట్లతో నిర్మిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను ఆమె సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈప్రాంతానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్వాతంత్య్ర సమరయోధులు మ్యూజియం పనులను పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ప్రహారి నిర్మాణంలో సమస్యను రైతులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం రాజుబంద గ్రామంలో నిర్మించిన మల్టీపర్పస్ సామాజిక భవనాన్ని పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలించి, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. లంబసింగిలో నిరుపయోగంగా ఉన్న ఐటీడీఏ అతిథి గృహాన్ని పర్యాటక సీజన్ నాటికి వినియోగంలోనికి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం చింతపల్లిలో కాఫీ పల్పింగ్ యూనిట్‌ను పరిశీలించి, మాక్స్ సొసైటీ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే మాక్స్ సొసైటీ సభ్యులు, కాఫీ రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు జి. డేవిడ్‌రాజు, టీసీఆర్‌ఎంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మందారాణి ఏఈ యాద కిషోర్, ట్రైకార్ సహాయకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.