
ముమ్మరంగా పోలీసు తనిఖీలు
● మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తం
● నిలిచిపోయిన అంతర్రాష్ట్ర రాత్రిపూట బస్సు సర్వీసులు
ముంచంగిపుట్టు: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మండల కేంద్రంలో ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మారుమూల లక్ష్మీపురం, కుమడ, భూసిపుట్టు, రంగబయలు పంచాయితీల నుంచి వచ్చే వాహనదారులను ప్రశ్నించారు. వారి లగేజి, బ్యాగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.అనుమానితుల వివరాలు సేకరించి విడిచిపెట్టారు. జోలాపుట్ట, దోడిపుట్టు నైట్‌హాల్ట్ బస్సులను మండల కేంద్రానికి పరిమితం చేశారు. ప్రభుత్వ కార్యలయాల వద్ద పోలీసులు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రామకృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రంలో కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో తనిఖీలు ముమ్మరం చేశామని ఆయన తెలిపారు.
సీలేరు: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా వలస సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా ఆదివారం సీలేరు, ధారకొండ వారపు సంతల్లో సీఆర్‌పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీలేరు మెయిన్ బజార్లో ఎస్‌ఐ రవీంద్ర అనుమానిత వ్యక్తులను విచారించారు. వారి సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేసి విడిచిపెట్టారు. విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లే రాత్రిపూట బస్సు సర్వీసులను నిలిపివేశారు. సాయంత్రం ఆరు గంటల తరువాత మారుమూల అటవీ ప్రాంతాల్లో బస్సులు తిరగకుండా ఇప్పటికే ఆదేశాలు అందాయి. దీంతో పాడేరు–సీలేరు, రాజమహేంద్రవరం– సీలేరు బస్సులు గడువుకు ముందే వచ్చాయి.

ముమ్మరంగా పోలీసు తనిఖీలు