
‘మధురవాడ’ బస్సు మొరాయింపు
● తరచూ ప్రయాణికుల ఇబ్బందులు
● పట్టించుకోని ఆర్టీసీ ఉన్నతాధికారులు
ముంచంగిపుట్టు: విశాఖపట్నం మధురవాడ డిపోకు చెందిన జోలాపుట్టు నైట్ హాల్ట్ సర్వీసు తరచూ మొరాయిస్తోంది. ఆదివారం ఉదయం జోలాపుట్టు నుంచి మధురవాడ (విశాఖపట్నం) బయలుదేరిన ఈ సర్వీసు మార్గం మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మరొక బస్సు కోసం గంటల తరబడి నిరీక్షించారు. కొంత మంది ప్రయాణికులు అత్యవసర పనులు ఉన్నందున ప్రైవేట్ వాహనాల్లో గమ్య స్థానాలకు చేరుకున్నారు. గత వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు బస్సు మొరాయించింది.
● గత సోమవారం మధురవాడ నుంచి జోలాపుట్టు బయలుదేరిన ఆర్టీసీ బస్సు మ ధ్యాహ్నం 3 గంటలకు విశాఖ కాంప్లెక్స్ వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొరాయించడంతో మరొక బస్సును సాయంత్రం 6గంటలకు అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి బయలుదేరిన అదే సర్వీసు చోడవరం వచ్చేసరికి బస్సు హెడ్ లైట్లు పాడైపోయాయి. మరమ్మతులు తరువాత బయలు దేరిన బస్సు తెల్లవారు జామున 3గంటలకు జోలాపుట్టు వచ్చింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తిండి లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇలా తరచూ ఇబ్బందులు పడుతున్నా కండీషన్‌లో ఉన్న బస్సులను నడిపేలా డిపో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఈ ప్రాంత ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.