
ఎకో టూరిజం ప్రాజెక్ట్ వద్దేవద్దు
● మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద గిరిజనుల నిరసన
● ఏకపక్షంగా ఎలా ఏర్పాటుచేస్తారనిఅటవీశాఖ తీరుపై ధ్వజం
అరకులోయ టౌన్: మండలంలోని మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయనున్న ఎకో టూరిజం ప్రాజెక్టు వద్దంటూ మాడగడ గిరిజనులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ పీసా కమిటీ అధ్యక్షుడు మండియకేడి బాలరాజు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక గిరిజనులతో కలిసి వ్యూపాయింట్ వద్ద మాట్లాడారు. పంచాయతీలో పీసా కమిటీ గ్రామ సభలు నిర్వహించకుండా అటవీశాఖ అధికారులు ఏకపక్షంగా ఎకో టూరిజం ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. మాడగడ వ్యూ పాయింట్‌లో మాడగడ గ్రామ గిరిజనులతోపాటు పంచాయతీ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ జాతీయ సంపదగా గుర్తించి స్థానిక గిరిజనులు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు స్వామి, బి. లక్ష్మణ్, వాసు దేవరావు, మాజీ సర్పంచ్ పి. అర్జున్, పీసా కమిటీ కార్యదర్శి బి. సుమన్ పాల్గొన్నారు.