
స్మార్ట్ రేషన్‌కార్డులు.. తప్పుల తిప్పలు
● రేషన్‌దారుల అవస్థలు
● వివరాలు సరిచేసేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
● పట్టించుకోని అధికారులు
సీలేరు: దశాబ్దాల కాలంగా నిరుపేద కుటుంబాలకు రేషన్ పొందేందుకు రేషన్ కార్డు ఒక గుర్తింపు. దశాబ్దాలు గడిచినా ప్రభుత్వాలు రేషన్ కార్డుల ద్వారానే వారికి సరకును పంపిణీ చేస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ రేషన్ కార్డుల పేరుతో లబ్ధిదారులకు ఇబ్బందులను గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రచారం ఆర్భాటంగా చేసుకుంటుందని కానీ కార్డుదారుడి వివరాల నమోదు తప్పులు తడకలున్నాయని, కార్డు దారులు చెబుతున్నారు. వాటిని సరిచేసేందుకు గ్రామ వార్డు సచివాలయం చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నామని చెబుతున్నారు. తప్పులున్న వివరాలతో కార్డుల మంజూరు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తునానరు. స్మార్ట్ కార్డులో ఇంటి పేర్లు, ఇంటి నంబర్, ఊరి పేర్లు, పాత జిల్లా పేరుతో, కుటుంబంలో ఒకరిద్దరి పేర్లు లేకపోవడం అనేక తప్పులు దర్శనమిస్తున్నాయి. పాతకార్డులో ఉన్న వారి పేర్లన్నీ కొత్తగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులో లేకపోవడం వంటి తప్పులు ఎక్కువగా చోటు చేసుకున్నాయని పలువురు చెబుతున్నారు.దీంతో వీటిని సరి చేయించుకోవడానికి గ్రామ,వార్డు సచివాలయాల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంట్లో కొందరి పేర్లు స్మార్ట్ కార్డులో లేకపోవడంతో రానున్న రోజుల్లో పింఛన్లు ఇతర అవసరాల కోసం ఏమి ఇబ్బందులు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
తప్పని ఇక్కట్లు
మంజూరైన స్మార్ట్ కార్డులు ఏ డిపో పరిధిలో ఉన్నాయో తెలుసుకునేందుకు కార్దుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు పిల్లల చదువుల నిమిత్తం తల్లిదండ్రులు ఒక ఊరు నుంచి మరో ఊరికి వలస వెళ్లే పరిస్థితిలు ఎక్కువగా ఉన్నా యి. కుటుంబ సభ్యులు ఉండేది ఒకచోట, ఆధార్ అడ్రస్‌లు మరొకచోట, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మరొ కచోట ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సరఫరా చేసే స్మార్ట్ కార్డులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు కూడా లబ్ధిదారులు అవస్థలు పడుతూ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు.
పాడేరు డివిజన్‌లో కార్డులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2,83,000 స్మార్ట్ కార్డులు పంపిణీ జరుగుతోంది. ఇందులో పాడేరు డివిజన్‌లో అరకు, పాడేరు రెండు నియోజవర్గంలో 11 మండలాలు ఉన్నాయి. జీకే వీధి మండలంలో 16 పంచాయతీల్లో 43 రేషన్ డిపోల పరిధిలో 17.043 కార్డులు వచ్చాయి.
ఈనెల 30 వరకు అవకాశం
ప్రభుత్వం పంపిణీ చేపడుతున్న స్మార్ట్ కార్డులో తప్పుగా ముద్రించి వచ్చిన కార్డులో వాటిని సరిదిద్దుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ప్రభుత్వం కల్పించింది. సచివాలయాలకి వెళ్లి సరి చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. కార్డులో ముద్రించిన తప్పడు వివరాలను సచిచేయం జరుగుతుందని అధికారులు తెలియజేస్తున్నారు.
గడువు పెంచాలి
స్మార్ట్ కార్డులు ముద్రణలో కార్డుదారులకు సంబంధించిన వివరాలు తప్పులు ఎక్కువగా ఉన్నాయి.వాటిని సరిదిద్దుకునేందుకు ఈనెల 30 వరకు అధికారులు అవకాశం కల్పించారు.అయితే మారుమూల ప్రాంతాల కార్డుదారులు గ్రామ సచివాలయాలకు వచ్చి కార్డులో వివరాలు మార్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం గడువును పెంచాలి. – ఉలాస్, ఎంపీటీసీ సభ్యుడు, దుప్పులువాడ
ప్రజా ధనం వృథా
లబ్ధిదారులకు ఇప్పటికే రేషన్ కార్డులు ఉండగా. ప్రభుత్వం వాటి స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించింది. ప్రజలకు ఇది ఒక పథకం కింద ప్రచారం చేస్తూ కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేయడం దారుణం.
– రాజు, సర్పంచ్, దారకొండ

స్మార్ట్ రేషన్‌కార్డులు.. తప్పుల తిప్పలు