
అధికారులు హాజరుకాని సమావేశాలు ఎందుకు?
రంపచోడవరం: ప్రతీ మూడు నెలలకు ఒకసారి జరిగే మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరకానప్పుడు ఎందుకు సమావేశాలని రంపచోడవరం ఎంపీపీ బంధం శ్రీదేవి అగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి ఎంపీడీవో జయంతి ఆధ్వర్యంలో ఎంపీపీ బంధం శ్రీదేవి అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మిలు పాల్గొన్నారు. ముందుగా ఇన్‌చార్జి ఎంపీడీవో జయంతి సమావేశానికి హాజరైన వివిధ శాఖల గురించి అడిగారు. అటవీశాఖ, ఆర్‌అండ్‌బి, జీసీసీ, ఆర్టీసీ, ఫైర్, పశుసంవర్ధక శాఖ తదతర శాఖల అధికారులు హాజరు కాలేదు. దీనిపై ఎంపీపీ బంధం శ్రీదేవి మాట్లాడుతూ మండల అధికారులు ఎవరు హాజరు కానిది సమావేశాలు ఎందుకని, కొన్ని శాఖల అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవల తీరుపై ధ్వజం
ఎంపీటీసీ సభ్యులు కుంజం వంశీ మాట్లాడుతూ స్ధానిక ఏరియా ఆస్పత్రిలో పనితీరు ఆధ్వాన్నంగా ఉందని, ప్రమాదంలో గాయపడిన వారికి సెక్యూరిటి సిబ్బంది కుట్లు వేస్తున్నారని సమావేశానికి హాజరైన వైద్యుడ్ని నిలదీశారు. సమావేశానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ హాజరు కావాల్సి ఉండగా ఎవరో ఒకర్ని పంపించి చేతులు దులుపుకుంటున్నారని సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ సమావేశానికి ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రసవం తరువాత ఇంటికి వెళ్లేటప్పుడు వారి నుంచి రూ.1000 వరకు ఆస్పత్రి సిబ్బంది వసూలు చేస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కొన్ని కేసులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నట్టు తెలిసిందన్నారు. అంబులెన్స్ సిబ్బంది రోడ్డు పక్కన ప్రసవం చేసిన కేసును ప్రస్తావించారు. ఆస్పత్రిలో వైద్యులు ఉన్నా ప్రయోజనం ఏముందని ఎద్దేవా చేశారు. ఈ విషయంపై సమావేశానికి హాజరైన డాక్టర్ సమాధానం చెప్పకపోవడంతో సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ముసురుమిల్లి, భూపతిపాలెం ప్రాజెక్టుల్లో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యులు తుర్రం వెంకటేశ్వర్లుదొర, వంశీలు కోరారు. దీనిపై తీర్మానం చేశారు. రంపచోడవరం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించిన సంవత్సరాల కాలం అవుతుందని, సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని తీర్మానం చేసి జిల్లా అధికారులకు పంపించాలని నిర్ణయించారు. సీతపల్లి బాపనమ్మ ఆలయం వద్ద షెడ్లు అధిక రేట్లుకు అద్దెకు ఇస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు జీడిమామిడి మొక్కలు సకాలంలో ఇవ్వాలని సభ్యులు కోరారు. వైస్ ఎంపీపీ పండా కుమారి, ఎంపీటీసీ సభ్యులు బచ్చల మంగా, సింగోజి కృష్ణకుమారి, రమణమ్మ, కో–ఆప్షన్ సభ్యులు షేక్ ఖాజావల్లీ తదితరులు పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశానికి అధికారుల
గైర్హాజరు
సభ్యుల ఆగ్రహం
స్థానిక ఏరియా ఆస్పత్రిలో అరకొర వైద్యంపై ధ్వజం
పర్యాటకాభివృద్ధికి చర్యలపై తీర్మానం