
విధుల్లో నిర్లక్ష్యం తగదు
రంపచోడవరం: మారేడుమిల్లి మండలం సున్నంపాడు గ్రామ సచివాలయాన్ని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఆదికర్మయోగి వివరాలు నమోదు విషయంలో సిబ్బంది పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు మలేరియా బారిన పడకుండా ఉండాలంటే శానిటేషన్ కార్యక్రమాలను మెరుగుపర్చాలన్నారు. డ్రైనేజీల్లో పూడిక తీసి ఫాగింగ్ క్రమం తప్పకుండా చేయాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సున్నంపాడులో సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించడం సంతోషంగా ఉందని కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణను అభినందించారు. సిబ్బంది అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వద్దని, ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఐటీడీఏ పీవో వెంట వెల్ఫేర్ అసిస్టెంట్ రెడ్డి, శ్రీలక్ష్మి తదితరులున్నారు.