
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
తగరపువలస/మధురవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శనివారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో మొదటి రోజు పరీక్ష సజావుగా జరిగింది. ఆనందపురం మండలం పాలవలస పంచాయతీ గుడిలోవలోని ఏక్యూజే స్టడీస్ సెంటర్‌ను 600 మంది అభ్యర్థులకు కేటాయించగా తొలి పేపర్‌కు 370 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు, అదనంగా 15 నిమిషాల గ్రేస్ సమయం కూడా ఇచ్చారు. కొందరు అభ్యర్థులు హాల్ టికెట్లు, ఐడీ కార్డులు మరచిపోగా.. నిర్వాహకులు వారికి డౌన్‌లోడ్ చేయించి అనుమతించారు. అయితే పరీక్ష కేంద్రం చిరునామా పాలవలసకు బదులుగా గండిగుండంగా పేర్కొనడంతో కొద్దిమంది అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. కేంద్రం వద్ద ఆనందపురం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే పీఎంపాలెంలోని సాంకేతిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో కూడా గ్రూప్–1 మెయిన్స్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇక్కడ 590 మంది అభ్యర్థులకు కేటాయించగా.. 389 మంది హాజరయ్యారు. రూమ్ నంబర్లను సూచించే బోర్డులు చిన్నవిగా ఉండటంతో అభ్యర్థులు గదులను వెతుక్కోవడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అలాగే మెయిన్ గేట్ నుంచి పరీక్ష గదులు సుమారు 200 మీటర్ల దూరం ఉండటంతో.. దివ్యాంగులు, గర్భిణులు నడవటానికి ఇబ్బంది పడ్డారు. సెల్ ఫోన్లు, వాచీలు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.

గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం