
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం
విశాఖ విద్య: ఈ నెల 25న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. నగరంలోని 19 పరీక్షా కేంద్రాల్లో 8,424 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో జామర్లు, తాగునీరు, టాయిలెట్లు వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. యూపీఎస్సీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ (నం. 0891–2590100, 0891–2590102) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో జరుగుతుంది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, యూపీఎస్సీ డైరెక్టర్ పట్నాయక్ సమావేశంలో పాల్గొన్నారు.