
ఆహారశుద్ధి పరిశ్రమలకు జిల్లా అనుకూలం
సాక్షి,పాడేరు: వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలంగా ఉందని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమల పార్కులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుపై వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో శుక్రవారం ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సాహిస్తామని, ఉపాధి పథకాల అమలులో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. జిల్లాలోని మూడు ఐటీడీఏల పరిధిలో ఆహారశుద్ధి, పౌల్ట్రీ, తేనె పరిశ్రమలు, రైతుబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. తేనె పరిశ్రమల ఏర్పాటుకు 100మందిని గుర్తించి వారికి తగిన శిక్షణ ఇస్తామన్నారు. పుట్టగొడుగుల పెంపకానికి వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆదిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ప్రాజెక్టుల గుర్తింపు, శిక్షణా కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు పరిశ్రమలు దోహ ద పడతాయన్నారు. గిరిజన రైతులు పండిస్తున్న ఆర్గానిక్ కాఫీ, మిరియం, పసుపు.అల్లం వంటి పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. బ్యాంకుల రుణాలు, పెట్టుబడులు, ప్రభుత్వశాఖల సహకారం, పరిశ్రమ పార్కులు ఏర్పాటుపై కలెక్టర్ అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.ఈ సమావేశంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, కట్టా సింహాచలం, అపూర్వభరత్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా పరిశ్రమల అధికారి రవిశంకర్, పశుసంవర్థకశాఖ డీడీ డాక్టర్ సీహెచ్ నర్సింహులు, జిల్లా పట్టుపరిశ్రమశాఖ అధికారి అప్పారావు, స్పైసెస్ బోర్డు ఫీల్డ్ అధికారి కల్యాణి, ఎల్‌డీఎం మాతునాయుడు పాల్గొన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తే ప్రోత్సహిస్తాం
కలెక్టర్ దినేష్‌కుమార్