
ఆస్పత్రి ఆవరణలో హిజ్రా మృతి
కొయ్యూరు: మండలంలోని డౌనూరు ఆస్పత్రిలో హిజ్రా పులి కుమారస్వామి అలియాస్ ఆకాంక్ష(23) మృతిపై పోలీసులు శనివారం విచారణ చేపట్టారు. గొలుగొండ మండలం జోగంపేటకు చెందిన ఆకాంక్ష కొద్ది రోజుల నుంచి డౌనూరులో ఉంటోంది. ఆమె ఇక్కడ ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద రీతిలో మరణించారు. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన వైద్యురాలు లలిత వెంటనే కొయ్యూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ కిశోర్‌వర్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మరణానికి డీహైడ్రేషన్ కారణం కావచ్చని అంచనాకు వచ్చారు. కారణం తెలియని మృతిగా కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. శుక్రవారం ఆకాంక్ష కడుపుమంటగా ఉందని డౌనూరు ఆస్పత్రికి వచ్చి గ్యాస్ట్రిక్‌కు సంబంధించిన రెంటాడిన్ ఇంజక్షన్ చేయించుకున్నారని తెలిపారు. తర్వాత సంతలోకి వెళ్లిపోయారన్నారు. దీని తర్వాత ఆమె అదే రోజు రాత్రి ఆస్పత్రి ఆవరణలో రోగులు కూర్చునే బల్లపై ఉండిపోయారన్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురై అర్ధరాత్రి సమయంలో మరణించి ఉంటారని భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని చెప్పారు. పాడేరు నుంచి క్లూస్ టీమ్ వచ్చి విచారించింది.
విచారణ చేపట్టిన పోలీసులు