హడావుడి | - | Sakshi
Sakshi News home page

హడావుడి

May 3 2025 7:33 AM | Updated on May 3 2025 7:33 AM

హడావు

హడావుడి

అతిథి గృహంలో
● సర్క్యూట్‌ హౌస్‌లో రెండోరోజు విచారణ ● సింహాచలం విషాద ఘటనపై త్రిసభ్య కమిషన్‌ ● అర్చకుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరినీ విచారించిన కమిషన్‌ ● మృతదేహాలు వెలికి తీసిన వారంతా సంప్రోక్షణ చేసుకోకుండానే విధుల్లోకి రావడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అర్చకులు ● నేడు ప్రభుత్వానికి నివేదిక అందజేత

సాక్షి, విశాఖపట్నం : ఊహకందని దారుణం.. సింహగిరి చరిత్రలో విషాద పేజీగా నిలిచిపోయిన చందనోత్సవం దుర్ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయింది. తొలిరోజున సింహాచలంపై సాగగా.. మలిరోజున ప్రభుత్వ అతిథి గృహం వద్ద హడావుడి కనిపించింది. అర్చకులు, వేదపండితులతో పాటు రెవెన్యూ, దేవదయ ధర్మాదాయ.. విభిన్న శాఖల అధికారులు, సిబ్బంది విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సుదీర్ఘ విచారణ సాగింది. దుర్ఘటనపై అన్ని విభాగాల నుంచి సమాచారం సేకరించిన త్రిసభ్య కమిషన్‌ ప్రభుత్వానికి శనివారం నివేదిక సమర్పించనుంది.

సింహాచలంలో ఏటా ఒక రోజు జరిగే పవిత్ర పర్వదినం అప్పన్న నిజరూపదర్శనం.. చందనోత్సవం విషాదోత్సవంగా మారిపోయిన ఘటన నుంచి విశాఖవాసులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. దేవాలయ చరిత్రలో ఇలాంటి దురదృష్టకరమైన ఘటన జరగడం ఇదే తొలిసారి కావడంతో.. భక్తులు ఆందోళన చెందుతున్నారు. మంత్రుల నిర్లక్ష్యంతో ఏడుగురు ప్రాణాలు బలిగొన్న తర్వాత ఉలిక్కి పడిన ప్రభుత్వం.. హడావుడిగా నియమించిన త్రిసభ్య కమిషన్‌ రెండు రోజుల విచారణ పూర్తి చేసింది. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో.. గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టి సమగ్ర వివరాలు సేకరించింది. ఆది నుంచీ గోడ కట్టకూడదని చెప్పినా వినిపించుకోకుండా.. కట్టడం వల్లనే విషాదం చోటు చేసుకుందని అర్చకులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో.. త్రిసభ్య కమిషన్‌ దేవస్థాన అర్చకులను కూడా విచారించింది. మాడవీధిని ఆనుకొని రక్షణ గోడ ఉన్నప్పుడు దాని పక్కన కొత్తగా మరో గోడ కట్టడం సరికాదంటూ వైదికులు చెప్పినా పట్టించుకోలేదని కమిషన్‌కు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ మహాపచారం చెయ్యడం వల్లే పెను విషాదం సంభవించిందని కూడా కమిషన్‌ ముందు తమ స్పందన వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మృతదేహాల వెలికితీత, శిథిలాల తొలగింపులో పాల్గొన్న సిబ్బందిని పుణ్యస్నానాలు ఆచరింపజేయకుండా, సంప్రోక్షణ చేసుకోనివ్వకుండా.. విధుల్లోకి తిరిగి చేర్చడంపైనా అర్చకులు కమిషన్‌ ముందు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా ప్రతి విషయంలోనూ ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరిగాయని కమిషన్‌కు అర్చకులు వెల్లడించారు.

వరదనీటి వ్యవస్థ లేదా..?

సింహాచలంలో వరద నీటిని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంపై కమిషన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2018లో రూపొందించిన దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌లోనూ ఈ అంశాన్ని పొందుపరచకపోవడంపై దేవస్థానం అధికారులు, వీఎంఆర్‌డీఏ అధికారులపైనా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండు మూడు దశాబ్దాలుగా సింహగిరిపై పడుతున్న సగటు వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని.. దానికనుగుణంగా నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం సరికాదని సూచించింది. కనీసం వరద నీటి నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధికారులు దృష్టి సారించకపోవడంపైనా విస్మయం చెందారు. మాస్టర్‌ప్లాన్‌లో ఉల్లంఘనలు ఉన్నట్లు కూడా ఉన్నాయని గుర్తించిన త్రిసభ్య కమిషన్‌... ఈ విషయంపై ఎందుకు దృష్టిసారించలేదని ఆయా శాఖల అధికారుల్ని ప్రశ్నించింది. రెండు రోజుల పాటు జరిగిన విచారణలో అన్ని శాఖల నుంచి సమగ్ర వివరాల్ని సేకరించిన కమిషన్‌.. శనివారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికను అనుసరించి.. ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే కేవలం చిన్న స్థాయి అధికారులపైనే ప్రతాపం చూపించి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులపై కనీస చర్యలు ఉండవనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వమే అసలు దోషి.!

ఈ ప్రమాదం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే తప్ప.. ఇంకోటి లేదన్నది ప్రతి ఒక్కరి నుంచి వినపడుతోంది. భారీస్థాయిలో భక్తులు వస్తారని, ప్రతి చందనోత్సవానికి వర్షం పడుతుందని తెలిసినా.. ఏర్పాట్లు విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు మంత్రుల కమిటీ బాధ్యతారాహిత్యం ఏడుగుర్ని పొట్టనపెట్టుకుందనీ.. వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. కేవలం.. అధికారులు, ప్రభుత్వ సిబ్బందిని బలి చెయ్యకుండా.. ఈ ప్రమాదం వెనుక ఉన్న మంత్రులపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటూ ప్రతి ఒక్కరూ డిమాండ్‌ చేస్తున్నారు.

తప్పు మాది కాదంటే.. మాది కాదు

శాఖల వారీగా విచారణ కొనసాగింది. దేవస్థాన అధికారులు, ఇంజినీర్లను తొలుత విచారించారు. గోడ నిర్మాణం, ప్రసాద్‌ పనుల ఆలస్యం.. మొదలైన విషయాలపై ఆరా తీశారు. అదే సమయంలో టూరిజం ఇంజినీరింగ్‌ అధికారులను కూడా విచారణకు హాజరవ్వమని ఆదేశించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇరు విభాగాల్ని ఒకేసారి విచారించిన కమిటీ ముందు.. గోడ నిర్మాణం, పనుల ఆలస్యం మొదలైన అంశాల్లో తప్పు మా శాఖది కాదు.. టూరిజం వాళ్లదేనని దేవస్థానం అధికారులు.. తమది కాదు.. వాళ్లదేనని టూరిజం ఇంజినీర్లు వాదించుకొని.. ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. దేవస్థాన ఇంజినీర్లతో పాటు టూరిజం ఇంజినీర్లది కూడా బాధ్యత ఉందని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులు కమిషన్‌కు నివేదించినట్లు సమాచారం.

హడావుడి1
1/1

హడావుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement