
గర్జించిన గిరిజనం
ప్రభుత్వం న్యాయం చేస్తుంది..బంద్ విరమించండి
ప్రత్యామ్నాయ జీవో తేవాల్సిందే:అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: జీవో నంబరు 3కు ప్రత్యామ్నాయంగా జీవోను తీసుకువచ్చి ప్రత్యేక డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయాలని ఆరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. అరకు లోయలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఖనిజ సంపదను తరలించుకుపోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంత ఉద్యోగాలను గిరిజనేతరులకు కట్టబెడుతున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రత్యామ్నాయ జీవోను తీసుకువచ్చి గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. ఎన్నికల్లో అరకులోయ వచ్చిన చంద్రబాబు జీవో నంబరు 3ను పునరుద్ధరించి గిరిజనులకు సంపూర్ణ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
సాక్షి,పాడేరు: గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల కల్పనకు జీవో నంబరు 3 పునరుద్ధరించాలని, గిరిజన ప్రత్యేక డీఎస్సీ తక్షణమే ప్రకటించాలని గిరిజన డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. వీటిపై ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని లేకుంటే గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర గిరిజన ప్రాంతాల నిరవధిక బంద్‌లో హెచ్చరించాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. పాడేరులో ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెల్లవారు ఐదు గంటలకే బంద్‌లో పాల్గొన్నారు. పాడేరు డిపో నుంచి బస్సులు నడపకుండా అడ్డుకున్నారు. పాడేరు ఘాట్‌రోడ్డు, జి.మాడుగుల రోడ్డుపై బైఠాయించారు.అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి, జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో బైఠాయించారు. గిరిజన ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
స్తంభించిన రవాణా
గిరిజన ప్రాంతాల్లో నిరవధిక బంద్‌తో ఏజెన్సీ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. గిరిజన డీఎస్సీ సాధన కమిటీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఏజెన్సీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పాడేరు డివిజన్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గమ్యస్థానాలకు చేరుకునేందుకు పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సాయంత్రం వరకు నిరీక్షించారు. జిల్లా కేంద్రం పాడేరులోని అన్ని దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. పాడేరు, అరకులో వారపు సంతలు జరగలేదు. అలాగే పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,ఆదివాసీ ప్రజా సంఘాల నేతలంతా ఐటీడీఏ ఎదుట రోడ్డుపైనే మధ్యాహ్నం భోజనం చేసి నిరసన తెలిపారు.
హామీలను చంద్రబాబు నెరవేర్చాల్సిందే:
వైఎస్సార్‌సీపీ డిమాండ్
సీఎం చంద్రబాబు ఇచ్చిన హమీ మేరకు నూరుశాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు ఆదివాసీలకు కల్పించే విధంగా గిరిజన ప్రత్యేక డీఎస్సీని వెంటనే ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. నిరవధిక బంద్‌లో పాల్గొన్న వారు మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాలు కల్పించే గిరిజన సలహా మండలి తీర్మానాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వెంటనే గిరిజన డీఎస్సీకి ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు. గిరిజనులకు అన్యాయం చేసే చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్పడితే ఉపేక్షించేది లేదని, గిరిజనుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు జర్సింగి సూర్యనారాయణ, కురుసా పార్వతమ్మ, కూడా సురేష్‌కుమార్, సీదరి రాంబాబు, కూడా సుబ్రహ్మణ్యం, తెడబారికి సురేష్‌కుమార్, కాతరి సురేష్, డి.పి.రాంబాబు, బోనంగి వెంకటరమణ, శరభ సూర్యనారాయణ, పాంగి నాగరాజు, లకే రత్నాబాయి, లకే రామ సత్యవతి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అరకులోయ టౌన్: గిరిజన సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయ తదితర సంఘాల పిలుపు మేరకు చేపట్టిన బంద్ అరకులోయలో విజయవంతం అయింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేసి మద్దతు ప్రకటించారు. గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, పెట్రోల్ బంక్‌లు, పర్యాటకశాఖ హోటళ్లు మూతబడ్డాయి. మైదాన ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు బంద్‌లో పాల్గొని మద్దతు ప్రకటించారు.
మెగా డీఎస్సీలో తీవ్ర అన్యాయం: గిరిజన
సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్
గిరిజన సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజన నిరుద్యోగులు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధానకార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, ఎంపీటీసీ దురియా ఆనంద్, సర్పంచ్ బీబీ బొజ్జ, మండల పార్టీ అధ్యక్షుడు స్వాహి రామ్మూర్తి, గిరిజన సంఘం నాయకులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఏజెన్సీ బంద్ విజయవంతమైంది. రంపచోడవరంలో హోటళ్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రైవేట్ వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని సర్వీసులను మాత్రం ఆర్టీసీ నడిపింది. బంద్ నేపథ్యంలో ఉదయం నుంచి గిరిజన సంఘాల నాయకులు స్థానిక అంబేడ్కర్ సెంటర్‌కు చేరుకున్నారు. బంద్‌లో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ల వాణిశ్రీ, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, ఆదివాసీ చైతన్య సంఘం జిల్లా అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి, ఆదివాసీ సంక్షేమ, సాంస్కృతిక సంఘ రాష్ట్ర నాయకులు కంగల శ్రీనివాసరావు, సీపీఐ నాయకుడు జుత్తుక కుమార్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
చింతూరు: ఆదివాసీ సంఘాల నాయకులు ఉదయం నుంచి స్థానిక మెయిన్‌రోడ్ సెంటర్‌లోని ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి పలు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డీఎస్సీ నుంచి ఏజన్సీ ప్రాంత టీచర్ పోస్టులను మినహాయించాలని, ఆదివాసీలకు వంద శాతం ఉద్యోగాలు, ఉపాధ్యాయ రిజర్వేషన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు జీవో నంబరు3పై ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీసం సురేష్, పల్లపు వెంకట్, లక్ష్మణ్, సుబ్బారావు, రాంబాబు, పుల్లయ్య పాల్గొన్నారు.
గిరిజన ప్రత్యేక డీఎస్సీపై చర్యలేవీ:ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
గిరిజన ప్రాంతంలో గిరిజనులకే సంపూర్ణంగా ఉద్యోగాలివ్వాలన్నదే జగన్‌మోహన్ రెడ్డి ఆలోచన అని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు అన్నారు. అరకులో జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జీవో నంబరు 3ను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి అడ్వకేట్ జనరల్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సుదీర్గంగా చర్చించారన్నారు. ఈ జీవోకు ప్రత్యామ్నాయంపై న్యాయ నిపుణులతో చర్చించి, సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాది కావస్తున్నా గిరిజన ప్రత్యేక డీఎస్సీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. దీనివల్ల సుమారు 500 మంది గిరిజన విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
సాక్షి,పాడేరు: జీవో నంబరు 3 అమలుచేయడంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు ప్రభుత్వం తగిన న్యాయ చేస్తుందని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు వేల సంవత్సరంలో జీవో నంబరు 3 జారీ అయ్యిందని, ఉపాధ్యాయ పోస్టుల్లో నూరుశాతం ఉద్యోగాల్లో 100 శాతం ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్, 33శాతం స్థానిక మహిళలకు ఉప రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. అప్పటినుంచి జరిగిన 11 జనరల్ డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ ల్లో జరిగిన నియమకాల్లో 100శాతం ఉద్యోగాలన్నీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ జరిగిందన్నారు. 2020 ఏప్రిల్ 22వతేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏపీస్టేట్, ఇతరుల కేసులో జీవో నంబరు 3 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ తీర్పు వెలువరించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లోని నియామక విధానాలను పునఃపరిశీలించి సవరించాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ఏపీ ప్రభుత్వం మొదటిగా మెగా డీఎస్సీ 2025 ప్రకటన చేసి,ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ మెగా డీఎస్సీలో జీవో నంబరు 3ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల జనరల్ రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ల మేరకు పోస్టులను ప్రకటించడం జరిగిందన్నారు. జీవో నంబరు 3కు ప్రత్యామ్నాయంగా గిరిజనులకు న్యా యం చేసేందుకు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గిరిజనులు సంయమనం పాటిస్తూ సహకరించి బంద్‌ను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ విజ్ఞప్తి
నేడు బంద్ కొనసాగింపు
గిరిజన ప్రత్యేక డీఎస్సీ డిమాండ్‌తో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త గిరిజన ప్రాంతాల నిరవధిక బంద్‌ను శనివారం కూడా కొనసాగిస్తున్నామని డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు పి.అప్పలనర్స, వంతాల నాగేశ్వరరావు, ఎస్.మాణిక్యం, కిల్లో సురేంద్ర, కూడా రాధాకృష్ణ, కె.చిన్ని, కెజియారాణి తదితరులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు మద్దతు తెలిపి సహకరించాలని వారు కోరారు.
ఇచ్చిన హామీలను
చంద్రబాబు
అమలుచేయాలి
కూటమి ప్రభుత్వం
స్పందించకపోవడంపై
నిరసన

గర్జించిన గిరిజనం

గర్జించిన గిరిజనం

గర్జించిన గిరిజనం

గర్జించిన గిరిజనం

గర్జించిన గిరిజనం