
రేపటి నుంచిశ్రీ మత్స్యమాడుగులమ్మ తల్లి జాతర
జి.మాడుగుల: మత్స్యరాస కుటుంబీకుల ఇలవేల్పు శ్రీ మత్స్యమాడుగులమ్మ తల్లి జాతర మహోత్సవాలు జి.మాడుగులలో ఈ నెల 4 నుంచి 6 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస రామరాజు, ప్రధాన కార్యదర్శి గసాడి రెడ్డిబాబు, ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు తెలిపారు. ఉత్సవాల మొదటి రోజు గిరిజన సంప్రదాయ ప్రకారం స్థానిక మాజీ ఎంపీ దివంగత మత్స్యరాస మత్స్యరాజు స్వగృహం నుంచి మత్స్యరాస వంశీయులు, భక్తులు, గ్రామపెద్దలు కలసి డప్పు వాయిద్యాల నడుమ ఘటాలను, పూర్వీకులు వినియోగించిన ఆయుధాలు ఖడ్గం, నాటు తుపాకీని ఊరేగింపుగా తీసుకొచ్చి రామాలయం ఆవరణలోని సతకంపట్టు వద్ద ప్రతిష్టిస్తామని వారు పేర్కొన్నారు. ఉత్సవాలు చివరి రోజు సతకంపట్టు నుంచి డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా కాల్పుల నడుమ భారీ ఊరేగింపుతో అమ్మవారి అను పు ఉత్సవం నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామ న్నారు. ఉత్సవాల మూడు రోజులు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేశామన్నారు.