
అప్పన్న ఆలయంలో ఘనంగా తిరునక్షత్రం పూజలు
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విశిష్టాద్వైత స్థాపకులు భగవత్ రామానుజాచార్యుల 1008వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఏటా ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ తిరునక్షత్రం పూజలు గత నెల 28న ప్రారంభమయ్యాయి. చివరి రోజైన శుక్రవారం జయంతి సందర్భంగా ఆలయ బేడామండపంలోని హంసమూలన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి, భగవత్ రామానుజాచార్యుల ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వారులను వేంజింపజేశారు. అనంతరం షోడశోపచార పూజలు, విశేష హారతులు, పారాయణం నిర్వహించారు.
ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రామానుజాచార్యుల తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది.