గ్రహణం | - | Sakshi
Sakshi News home page

గ్రహణం

May 2 2025 1:10 AM | Updated on May 2 2025 1:10 AM

గ్రహణ

గ్రహణం

అరకు అందాలకు

అర్ధంతరంగా నిలిపి వేసిన మాడగడ వ్యూ పాయింట్‌ రహదారి పనులు.. రోడ్డు పక్కనవృథాగా ఉన్న మెటీరియల్‌

పర్యాటకుల స్వర్గధామం మాడగడ సన్‌రైజ్‌

వ్యూపాయింట్‌

అరకులోయ టౌన్‌: అందాల అరకులోయ ఎన్నో ప్రకృతి దృశ్యాలకు ఆలవాలం. మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌, రణజిల్లెడ వాటర్‌ ఫాల్స్‌ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి, మిగతా అభివృద్ధి పనులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసింది. పనులు కొంత వరకు పూర్తయ్యాయి. ప్రస్తుత కూటమి సర్కారు వాటిని నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌కు వెళ్లే 3.75 కిలోమీటర్ల రహదారి, మురుగు కాలువలు, రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణానికి మంజూరైన రూ.11 కోట్లతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ శరవేగంగా పనులు చేసుకొచ్చారు. అయితే చేసిన పనులకు సంబంధించి రూ.1.8 కోట్ల బిల్లును కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రస్తుతం పనులు నిలిపివేశారు.

అటవీ అనుమతులు లేక 600 మీటర్ల రహదారి నిలిపివేత

విశాఖ–అరకు రూట్‌లో బోసుబెడ గ్రామం నుంచి మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ వరకు రహదారి నిర్మాణం తలపెట్టారు. సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ వద్ద వేస్తున్న రహదారిలో 600 మీటర్ల మేర ఫారెస్టు పరిధిలో ఉందని అటవీ శాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో రహదారి నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అరకులోయ మండలంలోని మాడగడ, బస్కీ పంచాయతీలతోపాటు, హుకుంపేట మండలం భూర్జ, అనంతగిరి మండలం పైనంపాడు ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. మిషన్‌ కనెక్ట్‌లో భాగంగా పాడేరుకు చాలా సులువుగా అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే దేశ విదేశాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంత అందాలు తిలకించేందుకు వచ్చే పర్యాటకుల కష్టాలు తీరుతాయి. కూటమి ప్రభుత్వం స్పందించి సకాలంలో బిల్లులు చెల్లించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులతోపాటు పర్యాటకులు కోరుతున్నారు.

● అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ వాటర్‌ ఫాల్స్‌ రహదారి పనులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లోనే రూ.1.8 కోట్ల బిల్లులు చెల్లించారు. ఆ తరువాత చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 10 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం మిగిలిపోయింది.

బస్కీ రోడ్డు పనులు పూర్తి చేయరూ..

అరకులోయ మండలం మాడగడ పంచాయతీ నందివలస జంక్షన్‌ నుంచి బస్కీ గ్రామం వరకు 11 కిలోమీటర్ల రహదారి మరమ్మతు, సీసీ రోడ్లు నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసింది. రహదారి మెటల్‌ పరిచి విడిచిపెట్టారు. దీంతో వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. చేసిన పనులకు కేవలం రూ.60 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగతా బిల్లు చెల్లించాల్సి ఉంది. రహదారి త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

● ప్రముఖ సందర్శిత ప్రాంతాల అభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా పెద్ద పీట వేశారు. మాడగడ సన్‌రైజ్‌ వ్యూ పాయింట్‌కు, రణజిల్లెడ వాటర్‌ ఫాల్స్‌ వరకు రహదారి నిర్మాణానికి రూ.16 కోట్లు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం పనులు పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.

బిల్లులు చెల్లిస్తే పనులు ప్రారంభిస్తాం

మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.1.80 కోట్ల బిల్లులు బకాయి ఉంది. దీంతో పనులు నిలిపివేశారు. సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ వద్ద సుమారు 600 మీటర్ల మేర అనుమతులు లేక అటవీ అధికారులు పనులు నిలిపి వేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే పనులు మళ్లీ ప్రారంభిస్తాం.

– రామమ్‌, డీఈఈ, పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖ, అరకులోయ

అసంపూర్తిగా డ్రైనేజీల నిర్మాణం

బోసుబెడ గ్రామం నుంచి మాడగడ సన్‌రైజ్‌ వ్యూ పాయింట్‌ వరకు రహదారితోపాటు బోసుబెడ గ్రామంలో డ్రైనేజీ అసంపూర్తిగా వదిలేశారు. కాలువలకు పైకప్పు వేయలేదు. దీంతో ప్రతి రోజు ఈ కాలువల్లో పశువులతోపాటు మనుషులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు స్పందించి మురుగు కాలువలు వెంటనే పూర్తి చేసి పై కప్పులు వేయాలి.

– శెట్టి కొండప్ప, గిరిజనుడు, బోసుబెడ, మాడగడ పంచాయతీ

రోడ్డుపై మెటల్‌తో.. ప్రమాదం

నందివలస–బస్కీ రహదారి నిర్మాణ పనులు చేపట్టి అర్ధంతరంగా నిలిపివేశారు. రోడ్డుపై మెటల్‌ వేసి విడిచిపెట్టడంతో వాహన చోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. నందివలస జంక్షన్‌ నుంచి బస్కీ పంచాయతీ కేంద్రం వరకు రహదారి మరమ్మతు పనులు, ఇతర పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ త్వరితగతిన పనులు పూర్తిచేయాలి. ఇందుకు అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – కిల్లో రామన్న, వైస్‌ ఎంపీపీ, అరకులోయ

గ్రహణం1
1/5

గ్రహణం

గ్రహణం2
2/5

గ్రహణం

గ్రహణం3
3/5

గ్రహణం

గ్రహణం4
4/5

గ్రహణం

గ్రహణం5
5/5

గ్రహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement