
నాణ్యత లోపిస్తే సహించేది లేదు
పెదబయలు: జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా జరుగుతున్న గ్రావిటీ పథకాల నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలు ఉంటే సహించేది లేదని కలెక్టర్ ఎఎస్.దినేష్‌కుమార్ హెచ్చరించారు. గురువారం పెదబయలు మండలం వనభంగి పంచాయతీ జడిగుడ గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో వృద్ధాప్య పింఛన్లు 20 మందికి, వికలాంగ పింఛన్ ఒకరికి, వితంతు పింఛన్లు ఇద్దరికి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన గ్రామ సభలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా రూ.8 లక్షలు మంజూరయ్యిందని, సకాలంలో పని ప్రారంభించి తాగునీరు అందించాలని సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. తాగునీటి పథకానికి నీరు అందించే ఊట గెడ్డను కిలోమీటరు దూరం నడిచి వెళ్లి పరిశీలించారు. అనంతరం పాఠశాల భవనం, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. వనభంగిలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం పూర్తి చేయాలని, దిగువ పేడాపల్లి, దమ్ముగుడ, పనసపుట్టు, తోటలగొంది, డుంబగుడ గ్రామాలకు సీసీ రోడ్లు మంజూరు చేయాలని, నిమ్మగుండ లబ్జిరి మీదుగా తారురోడ్డు మంజూరు చేయాలని స్థానిక వైస్ ఎంపీపీ కొర్రా రాజుబాబు, సర్పంచ్ కొర్రా కాసులమ్మ కోరారు. ఈ పనులకు అంచనాలు తయారు చేసి నివేదించాలని కలెక్టర్ ఇంజినీర్లను ఆదేశించారు. ఎగువ పేడాపల్లి గ్రామంలో జల్‌జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సదరం సర్టిఫికెట్ ఉన్నా ఫించన్ మంజూరు కావడం లేదని జడిగుడ గ్రామానికి చెందిన కొర్ర హరి అనే వికలాంగుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.
జడిగుడలో పింఛన్ పంపిణీ
కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ గురువారం పెదబయలు వనభంగి పంచాయతీ మారుమూల పీవీటీజీ గ్రామమైన జడిగుడలో స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,22,403 మందికి రూ.51,48,66,500ల లబ్ధి చేకూరుతుందన్నారు. మొదటి రోజు గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 94.93 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేశామన్నారు. అనంతరం పీవీటీజీ మహిళలతో మాట్లాడారు. డీఆర్‌డీఏ పీడీ మురళి, ఎంపీడీవో ఎల్.పూర్ణయ్య, తహసీల్దార్ రంగారావు, ఏపీఎం దేవమంగా, ఏపీవో సూరిబాబు, వైస్ ఎంపీపీ రాజుబాబు, వనభంగి సర్పంచ్ కొర్ర కాసులమ్మ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అవసరమైన పనులకు అంచనాలు తయారు చేయండి : కలెక్టర్
పెదబయలు మండలంలో
పలు అభివృద్ధి పనుల పరిశీలన

నాణ్యత లోపిస్తే సహించేది లేదు