
గిరిజన డీఎస్సీ సాధన కోసం..
అరకులోయ టౌన్: జీవో నెం.3 పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, గిరిజన ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని గిరిజనులు శుక్రవారం నుంచి నిరవధిక బంద్‌కు దిగుతున్నారు. ఆదివాసీ ప్రజాసంఘాలు, గిరిజన డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో అడవి బిడ్డల ఆందోళన ఉధృతమవుతోంది. బంద్ పాటించాలని గిరిజన ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేశారు. అధికారులకు కూడా ముందుగానే బంద్ సమాచారం అందించారు. గిరిజనుల ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
మన్యం బంద్ విజయవంతం చేద్దాం
బంద్‌లో పాల్గొనాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జీవో నంబర్ 3 పునరుద్ధరించి, గిరిజన నిరుద్యోగ యువకులకు న్యాయం చేయాలన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ జీవోకు ప్రత్యామ్నాయంగా నూతన జీవో తీసుకురావాలన్నారు. పార్టీలకు అతీతంగా గిరిజనులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలన్నారు. ఆదివాసీ స్పెషల్ డీఎస్పీ నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగం అరకులోయ సభలో జీవో నంబర్ 3ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకోవాలన్నారు. దానిని పట్టించుకోకుండా దగా డీఎస్పీ ప్రకటించడం దారుణమన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ రాంప్రసాద్, సోషల్ మీడియా ఇన్‌చార్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల పొట్ట కొట్టొద్దు
జీవో నంబర్ 3 పునరుద్ధరించకపోతే 600 మంది గిరిజన నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతారని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకుడు డాక్టర్ కుంభా రవిబాబు ఆన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో ఐటీడీఏ పరిధిలోరి 766 పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి 6 శాతం గిరిజనులకు, ఇతరులకు 94 శాతం ఇవ్వడం వలన కేవలం 42 పోస్టులు మాత్రమే ఆదివాసీలకు దక్కుతాయన్నారు. ఇది గిరిజనులను నిలువునా వంచించడమేనన్నారు. మన్యం బంద్‌లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న డాక్టర్ తెడబారికి సురేష్ కుమార్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.
నేటి నుంచి గిరిజన ప్రాంతాల్లో
నిరవధిక బంద్
జీవో నెం.3 పునరుద్ధరించాలని డిమాండ్

గిరిజన డీఎస్సీ సాధన కోసం..