మద్దిపాడు: మద్దిపాడు ఎంపీటీసీగా 2014 – 19 మధ్య కాలంలో పనిచేసిన పాటిబండ్ల చినరామయ్య (90) వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. వివాదరహితుడుగా అందరి మన్ననలు పొందిన చినరామయ్య మృతి చెందడంపై స్థానిక నాయకులు పలువురు ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలియజేశారు.
కొత్తపట్నం: రోడ్డు ప్రమాదంలో మూడు గేదెలు, ఒక ఆవు మృతి చెందాయి. ఆ వివరాల ప్రకారం.. కొత్తపట్నం గ్రామానికి చెందిన పుచ్చలపల్లి తిరుమల పశువులు మేపుకుని జీవిస్తుంటాడు. రోజూలాగే ఆదివారం పశువులను పొలానికి తోలుకెళ్లాడు. అవి మేత మేసి తిరిగి ఇంటికొచ్చే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గేదెల కోసం రాత్రంతా ఎదురుచూసిన తిరుమల.. సోమవారం ఉదయం వెళ్లి చూడగా, డీడీ కాలనీ ఎదురుగా ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా రెండు గేదెలు, ఒక ఆవు మృతి చెంది పడి ఉన్నాయి. మరో గేదె కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. కొనప్రాణంతో ఉన్న గేదెకు పశువైద్యుడిని పిలిపించి చికిత్స చేసినా ఫలించలేదు. ఆ గేదె కూడా చనిపోయింది. వాటన్నింటి విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై వేముల సధాకర్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఢీకొట్టిన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
● సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు
ఒంగోలు టౌన్: నాణ్యమైన పొగాకు పండినప్పటికీ సరైన ధరకు కొనుగోలు చేయకుండా నో బిడ్ల పేరుతో కంపెనీలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు కేవలం 10 శాతం మాత్రమే కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. గత ఏడాది కిలో రూ.280 తో ప్రారంభించగా ఈ ఏడాది గరిష్ట ధర రూ.250 కే పరిమితమైందన్నారు. ప్రారంభంలో ప్రకటించిన ధరలను కూడా క్రమంగా తగ్గిస్తూ కనీస ధరలను రూ.160 కు దిగజార్చారని వివరించారు. పొగాకు కంపెనీలు సిండికేట్లుగా మారి రైతుల శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు. అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తుండడం దారుణమన్నారు. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రస్తుత ధరలతో ఒక్కో బ్యారన్‌కు రూ.3 నుంచి రూ.4 లక్షల నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొందన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించి ఎస్టీసీ, మార్క్‌ఫెడ్, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా నిల్వలన్నిటినీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతుల గిట్టుబాటు ధరల కోసం ఈ నెల 19వ తేదీ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు.
● కలెక్టరేట్ ఎదుట వాచ్‌మెన్‌ల ధర్నా
ఒంగోలు టౌన్: అపార్ట్‌మెంట్లలో వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తద్వారా వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.మోహన్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా అపార్ట్‌మెంట్ల వాచ్‌మెన్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ గ్రామాల్లో జీవనోపాధి లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని వేలాది మంది నిరుద్యోగ యువకులు, కార్మికులు పట్టణాలకు వలస వస్తున్నారని తెలిపారు. వారిలో వేరే పనులేమీ దొరక్కపోవడంతో అపార్ట్‌మెంట్లలో వాచ్‌మెన్లుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి వారందరినీ ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఏదైనా అనుకోని విధంగా ప్రమాదాలు సంభవించినప్పుడు సంక్షేమ బోర్డు ఆదుకుంటుందన్నారు. అపార్ట్‌మెంట్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.రామకృష్ణ, జి.నరసింహరావు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన ఒంగోలులోని అపార్ట్‌మెంట్లలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. ఒంగోలులో పనిచేస్తున్న 1000 మంది కార్మికులకు తలదాచుకునేందుకు సొంత గృహాలు లేవని ఆవేదన చెందారు. ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలన్నింటినీ అందజేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఉల్లగంటి వెంకటేశ్వర్లు, వినుకొండ పాపారావు, స్వర్ణ రమేష్, జటావత్ నాయక్, అంజి, వెంకటేష్, మాట రామారావు పాల్గొన్నారు.


